పుట:Abraham Lincoln (Telugu).pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వడకుండినను అక్షరముల గూర్చునంతటి సమర్ధతనొంది యుత్సాహకలితుడయ్యెను. వాచకమునమాత్ర మత్యద్భుతశక్తి సంపాదించెను. ఇంతేల. ఎనిమిది పది వారముల దన యుపాధ్యాయు నతటివా డాబ్రహా మాయెనని నొడివిన నతని బుద్ధివిశేషము బయలుపడ గలదు. ఈ విషయము గురువగు హేజల్ గమనించినట్లు నిదర్శనము లున్నవి.

ఆకాలమున నా ప్రాంతమున మత ప్రసంగమున కెడము లేకుండెను. దేవాలయములును, మతవిషయిక సభలును మిక్కిలి యరుదు. ఆప్రదేశమున కప్పుడప్పు డొక మతాచార్యుడు వచ్చుచుండును. దైవికజ్ఞాన మంత గలవాడు గాకున్నను పురోహితన్యూనత జేసియు, సర్వజనప్రియత్వంబున జేసియు, నతడె స్వాగతం బనుభవించుచుండును. అతడును నెడనెడ లింకనుల కుటీరమున నుపన్యసించి తనత్రోవ దా బోవును. కావున సాధారణార్చనలును బైబిలు పఠనమును వారు దమంతకు దామ నెరవేర్చుకొనుచుందురు. ఆబ్రహాము లింకను దల్లి యక్షరజ్ఞురాలు. భాను వాసరంబులను మఱి యితరదినములను దమకు గల పుస్తుక రాజం బొక్కటి బైబిలును పలుమారు చదువుచుండును. దాని వినుట యందును నద్దాని యందలి కథలకు జెవి యిచ్చుటయందును నాబికి మిక్కిలి యాసక్తి. పుస్తకము చదువ నేర్చుకొనుటకు