పుట:Abraham Lincoln (Telugu).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బనిచేయ బంచి థామసును దగ్గర నునుచుకొని తానొక చేని కావరణము గట్టుచుండెను. ఆ కార్యమున మగ్నుడై యుండ దటాలున నొక్కగుండుదెబ్బ యతనిని నేలగూల్చె. థామసు దిగ్భ్రమ జెందె. అతని యన్న మార్డికే సాహాయ్యార్థము ప్రక్కపల్లియకుఱికె. మఱియొకయన్న జోషియా దమకుటీరము జేరుకొని గోడకన్నముల నుండి శత్రువుల బరిశీలింపదొడగె. వారు దమ దాగుడుభూమి వదలి యేతెంచి తండ్రి భూమివ్రాల దిగ్భ్రమజెంది నిలుచున్న థామసుగాంచి యతని నెత్తుకొనిపోవ బ్రయత్నించిరి. అయిన జోషియా సూటిగా జూచి థామసు నెత్త నుద్యమించుచుండిన యింది యనును యమనిలయంబున కతిథి జేసె. మార్డికే సబలుడై యారంగముపై జూపట్టె. థామసును దిగవిడచి యిందియనులు రయమున దొలగి చనిరి.

కటకటా! కడుపుకక్కురితి దనకును దనబిడ్డలకును భోజనము సమృద్ధిగ దొరకును గదా యనుపేరాసచే లింకను తాత యిట్లు చిచ్చుఱికి ప్రాణములు గోలుపోయెగా! ఇక నతని కుటుంబమునకు జీవనాధారమేమిగలదు. చేతికష్టము చేసి వారిని దొందరలపాలుసేయక రక్షించుచుండిన యా సత్యసంపన్నుని కళేబర మింటికి దెచ్చినపు డావిపన్ను లెంత పొగిలిరో మనమూహింపగల్గుదుమే?