పుట:Abraham Lincoln (Telugu).pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చుండిరి. రాజకీయోద్యోగస్థులకును, దేశీయసభాజనులకును, ప్రభువులకును గొందఱికి హస్త మొసగి, విసిగి, తరువాత దలయూచుట చేతనే సమ్మానించుచుండెను. తుట్టతుద కొక గాయముతగిలిన సైనికుడు నామమాత్రము వస్తధారియగు దన ముసలితల్లితో, బ్రవేశించుట గని లింకను దనస్థానము నుండి వేగముగ బోయి వారి కత్యాదరముతో హస్త మొసగి యతిసంతసంబున స్వాగత మిచ్చి ముదుసలినిగూర్చి "తల్లీ! నీకడుపు చల్లనయ్యె. ఇట్టి దేశాభిమాని యగు గుమారుని గన్న నీవు ధన్యురాలవు. నీ పుత్రునిస్థితికి నే నెంతయు దు:ఖించు చున్నాను" అని చెప్పెను.

ఒకానొకదినమున లింకను, దన గదినుండి ప్రక్కగా బోవు త్రోవన దేనీళ్లు పుచ్చుకొని వచ్చుటకు బోవుచు, మార్గముమధ్యమున నొక పాపని యాక్రందన ధ్వని విని వెనుకకు దిరిగి యుద్యోగస్థానమున కేతెంచి సేవకుని బిలిచి,

"ఓయీ! ప్రక్కన నెవరైన నొకస్త్రీ వేచియున్నదా" యని యడిగెను. "అవును మహాప్రభూ! మూడురోజుల నుండి యామె యున్నద"ని వా డనెను. అట్టి యాలస్యమునకు జింతిల్లుచు నాయమ నిచ్చటికి దక్షణమే తీసికొని రమ్మని యానతిచ్చెను. చంటిపిల్ల నెత్తుకొని, యొకస్త్రీ శీఘ్రకాలములో బ్రవేశించి సేననుండి పాఱిపోయినందుకు దన