పుట:Abraham Lincoln (Telugu).pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దానికి లింకను "ఇది యెన్నటికిం దగదు. ఈవిధమున గార్యదర్శి స్వతంత్రింపగూడదు. ఆపని తనదిగాదు. నాదె యగు" ననెను.

శత్రువులచేత బడిన రాజ్యాంగసైనికుల వారు బహుక్రూరముగ జూచుచువచ్చిరి. దేశపు జనులెల్లరును గొన్ని ఘోరకృత్యముల విని కోపోద్దీపితులై యుండిరి. కావున గొందఱు లింకనుం డాసి "మనచే బడినశత్రుజనుల బాధించి ప్రతీకార మొనరింపుడ"ని నుడివిరి. అదివిని యత డాగ్రహము సూచించి,

"ఆవిధమున నేనొక్కనాడును మనుష్యుల బీడింప జాలను. ఎవ్వ రేమియాడిన నాడుదురు గాక, ఏమి చేసినను జేయుదురుగాక, నేనట్టి యమానుష కార్యముల సహింప జాల" నని ప్రత్యుత్తర మిచ్చెను.

లింకను కక్షవా రనేకులు కామేరనను కార్యదర్శిపై నిష్టము లేనివారై యతని నాపదవినుండి దీయింప సమకట్టి కొందఱు ప్రతినిధుల నేర్చి లింకనువద్దకు బంపిరి. వారు సెప్పున దంతయు విని లింకను,

"అయ్యలారా! మీ రేమో చెప్పుచున్నారు. అయినను నాకు నమ్మకము దట్టదయ్యెను. అతనిపై నొక్క సత్యమగునేరము సూపితిరేని నే నాతనిశిరంబు మీ కప్పగించెదను.