పుట:Abraham Lincoln (Telugu).pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"ఒకరోజు మే మెల్లరమును గుడువ బదార్థము లెల్లయు గర్చుపడి యుండెను. అట్టి తరుణమున మీ రేగుదెంచితిరి. కొంచెము రొట్టెయు బాలునుమాత్రమునే మీ కొసంగితిని. మీ రది స్వీకరింపుచుండగ నే మన్నన వేడ 'జింతిలనేల. ఈయాహారము దేశాధ్యక్షున కైనం జాలదా' యంటిరే" యని యావృద్ధనారి సౌహృదయముగ బల్కెను.

లింకను దానికి నవ్వి యా స్వల్పాహారము జ్ఞప్తికి దెచ్చుటకై స్నేహభావమున నెనిమిదిమైళ్లు నడచివచ్చిన యవ్వం గొనియాడెను.

చికాగో పట్టణమున లింకనును గారవింప నొక గొప్ప సభ జరిగెను. ఆసమయమున నొక చిన్నపిల్ల భయపడుచు లింకనును జేరవచ్చు చుండెను. లింక నది గనిపెట్టి చేసైగచే దానిం బిలిచి "అమ్మాయీ! నీ కేమి కావలయు దెల్పు" మని యడిగెను. సంకోచవృత్తి నాకన్నె "మీపేరు గావలె" నని వేడెను. ఇంతలో మఱికొందఱు గన్యలు వచ్చుట గాంచి లింకను "ఇక్కడ నింకను గొందఱుపడుచు లున్నారు. నీ కొక్కదానికె నా నామమిచ్చిన వా రెల్లరు నసంతుష్టు లగుదురుగదా" యనెను.

"మొత్తము మే మెనిమిదిగు రున్నారము. మాకందఱకు మీ పేరియ్యవలయు నని" యా శిశువు వల్కెను.