పుట:Abraham Lincoln (Telugu).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిభాషనే యందఱును వాడవలయు. ఎప్పుడు నుపయోగించుచుండిన నాక్రొత్తపరిభాషకే గహనార్థంబు సమకూరు. ఇంగ్లీషువారును నిటులనే చేయుచున్నారు. యూరపుపండితులచే నిర్మితంబగు శాస్త్రీయపరిభాష యెంత కర్ణకఠోరం బయినను ఇంగ్లీషు గ్రంథకారులు దానినె వాడుచున్నారు. ఇందువలన శాస్త్రాభివృద్ధికిని, భాషాంతరీకరణంబునకును మిక్కిలి సహాయము కలుగుచున్నది. మనమును అటులనే నాగరీప్రచారిణీ సభవారిపరిభాష గ్రహింతము. ఇక మనవా రిదివఱకు మనభాషయందు నిర్మించిన కొన్నిపారిభాషికపదములగతి యేమని కొంద ఱడుగవచ్చును. మనపదములు నాగరీప్రచారిణీ సభవారిపదములకు నవిరుద్ధము లయినయెడల రెండును పర్యాయములుగా వాడుకొనవచ్చును. 'ఆక్సిజన్‌' అనువాయువును వారు 'అమ్లజన' మనిరి; మనవారు 'ప్రాణవాయువు' వనిరి. వీనిని బర్యాయపదములుగా వాడవచ్చును. మనపదము వారిపదమునకు విరుద్ధముగా నున్నప్పుడు మనము మనపదమును విడువవలెను. ఇందుకు దార్కాణము, మనవారు 'అసిడ్‌' (Acid) అనగా 'క్షార' మనిరి. సభవారు 'ఆసిడ్‌' (Acid) అనగా 'ఆమ్ల' మనిరి. 'క్షార' శబ్దము ఆల్‌కలీ (Alkali) కి సమానార్థక మనిరి. కాన మనము మనపరిభాషను మార్చుకొనవలెను. ఈ నిబంధనానుసారముగా మాగ్రంథమాలలోని ప్రకృతిశాస్త్రములు వ్రాయబడును. ఇతరగ్రంథకారులును నీపరిభాషనే వాడినయెడల మనభాషయందు శాస్త్రీయపరిభాష స్థిరపడగలదు.

మేముగాని మావలె నితరప్రకాశకులు (Publishers) గాని ప్రచురించుగ్రంథంబుల గొనుట యింగ్లీషు నేర్చినవారు చేయవలసిన రెండవపని. మే మింగ్లీషులో నన్నియు జదివెదము, మాకు దెలుగుపొత్తంబు లేలయని కొంద ఱడుగుదురు. కాని యింగ్లీషు వచ్చినంతమాత్రమున వీరన్ని గ్రంథంబుల నాభాషయందు జదువుచున్నారనుటయు, నాభాషలోని యన్నిశాస్త్రీయగ్రంథంబులు వీరి కర్థ మగు ననుటయు నిజము గాదు.