పుట:Abraham Lincoln (Telugu).pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"కొంచెము నిలుపుము. నీవు చెప్పినరీతిని వ్యయపఱచుట కంగీకరింప" నని సహవాది వల్కెను.

"ఏలొకో?"

"మీ మాఱుదల్లి ముదుకలి యగుచున్నది. బహు కాలము జీవింపదు. ఆయమ యనంతర మాచేను నీవ యనుభవించున ట్లేర్పఱుపవలెను."

"అట్లు నే నొక్కనాటికి జేయను. ఆయమ నాపై గనుపఱచిన విశ్వాసప్రేమల కేనొనర్చు నుపకృతి బహు స్వల్పము. అందును లోపము సేయ నా మనసొప్ప" దని ఖండితముగ బలికి తనచేతనైన త్వరలో నాయాస్తిగొని మాఱుదల్లి కిచ్చివేసెను.

1851 వ సంవత్సరమున దండ్రికి మరణావస్థ దటస్థించిన దని విని లింకను గార్యబాహుళ్యమున జేసియు దనభార్యను ఘోరతర వ్యాధి బీడించుచుండుట జేసియు గదలిపోజాలక పితృభక్తి యుట్టిపడు పదముల నుత్తరమొకటి వ్రాసి పంపెను. అందు గొంతభాగ మీక్రింద వ్రాయబడుచున్నది.

"నాతండ్రికిగాని తల్లికిగాని వారు జీవించినంతకాల మెట్టిసౌఖ్యలోపంబును నుండ గూడదని నాకోరిక. తండ్రిగారి కిప్పటి జబ్బు కుదురుటకు వలయు వైద్యులుగాని వస్తువులు గాని నాపేరు స్వేచ్ఛగ నుపయోగించి సమకూర్పవలసినది.