పుట:Abraham Lincoln (Telugu).pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేరము నిస్సంశయముగ స్థాపింపబడె ననుకొనుచుండిరి. అయిన నతనిచర్చ ప్రారంభమగుటతో నానేర మన్యాయముగ నీతరుణమున విల్లియముపై మోపబడెననుట విశదమాయెను. లింకను మనస్థితి వర్ణింప బదసామగ్రి చాలదు. ఒక్కెడ దన యుపకారికి బ్రత్యుపకారము సేయవలయు నను వాంఛయు, నొక్కెడ నన్యాయపు నేర మారోపించిన దుష్టాత్ములపై గిన్కయు, మఱి యొక్కెడ నిరపరాధి కిట్టి యిడుమలు దటస్థించె నను వగపును, నింకొక్కెడ నితరులకష్టముల మాన్ప బురికొల్పు సహజదయామయత్వంబును నతనిహృదయముం బ్రజ్వరిల్ల జేయుచుండెను. దాన జేసి యతని వాద మద్భుత వాక్పాటనము వల్లను, గ్రమక్రమముగ నారోపణ మొనర్చు స్వనగాంభీర్యము వల్లను, మాటిమాటికి మనోవికారముల బోధించు ముఖవైఖరీభేదముల వల్లను వినువారి మనముల నినుమును గాంతమువోలె నాకర్షించి యైంద్రజాల శక్తిబలంబునబోలె మార్చివేసెను. అచ్చటివారెల్ల లింకను వాదము వినకమున్ను విల్లియముపై నెంతయాగ్రహ మూనియుండిరో యంతయాగ్రహము వినిన తరువాత బిర్యాదిపై బూనిరి. వా రందఱు లింకను శక్తికిమెచ్చి యనేకపర్యాయములు మహారావము నింగి ముట్ట జేతులు చఱచిరి.

న్యాయాధిపతియు జ్యూరరులును విల్లియము నిరపరాధి యని యతని విడుదలచేసిరి.