పుట:Abraham Lincoln (Telugu).pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గుఱ్ఱమును దానిపై సామగ్రి మోసికొనిపోవుట కొక తిత్తియు గొనుట కతనికి ధన మొక స్నేహితు డియ్యవలసివచ్చెను. అశ్వ మావశ్యక మై యుండెనా యను సంశయము చదువరుల మనములకు గోచరింపవచ్చును.

ఆకాలమున గక్షిదారులు న్యాయస్థానమునకు బోవుట లేదు. న్యాయస్థానమ గక్షిదారుల నరసికొని సంచరించుచుండును. న్యాయాధికారులు దమతమ నిర్ణీతప్రదేశములకు వెడలి యెచ్చటి వివాదముల నచ్చటనె తీర్చివచ్చుచుందురు. ఇట్టిన్యాయస్థలములకు దేబడు వివాదముల సంఖ్య కనుగుణముగ 'భ్రమణ' కాలము పట్టుచుండును. ఒక్కొకమా రీ 'భ్రమణము' లనుండి లింక నింటికి మూడుమాసముల మీదట దిరిగివచ్చుచుండెను. ఇట్లొకతరి యతడు గార్యార్థియై వెడలియుండినపు డతనికి సందియము గొలుప నాతనిభార్య దమగృహమున కింపులు గురిపించు మేడ గట్టించి నూతనాకారము వహింప జేసెనట. లింకను మఱలివచ్చి యింటియందలి మార్పుల బరికించి తెలియని వానిబోలె దూరముననుండు నొకని బిలిచి,

"నాయనా! లింక నిప్పు డెచట నివసించు. ఇదివఱ కీ గేహంబున నుండునే?" యని ప్రశ్నించెనట.

కొంతద్రవ్య మార్జించినపిదప లింక నొక యొంటి గుఱ్ఱపు బండిని సంపాదించెను. అదియు నంత యుత్తమమైనది గాదు.