పుట:Abraham Lincoln (Telugu).pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బోలె పెంచబడిన చిన్నవా డే ప్రకార మా వృత్తియం దడుగువెట్టునని యతనికి సందేహము. అయిన దన కొక్క జీవనాధార వ్యాపారము లేక యటునిటు తిరుగుచుంట నతడు సహింపలేకుండెను. పసితనముననే యేదో యొక వృత్తి నిశ్చయించుకొని విడువక పాటుపడ కున్న మనుజుడు వాంఛాసిద్ధి వొందలేడని తర్కించి తా నట్లు చేయు మార్గ మరయు. అరసి కానలేక బహువెతల దగులు. తా నెద్దానికి బనికి రా డని తలంచెనో దానిన దన స్నేహితులు ప్రయత్నింపు మనుచుండు టతని కింక నెక్కుడు వ్యసనకారి యాయెను. తన శక్తిని దాను గొద్దిగ దలంచుకొని యితరులు తన కెక్కుడుశక్తి నారోపించిరని వగచు. ఇది యతనియం దొకలోపమే యైనను మిక్కిలి మంచిలోపము. ఈవిధముగ లోపముగల పసివారి సంఖ్య చాల తక్కువ. తమ శక్తి సామర్థ్యములు ముల్లోకముల మించునని భ్రమసి తప్పుదారుల బట్టువా రనేకులు గలరు. కొందఱు పనికిమాలిన వెడగులు లోకము దమకు లోకువ యనుకొనుచుందురు.

ఆ.వె. అల్పు డెపుడు పల్కు నాడంబరముగాను
     సజ్జనుండు పల్కు జల్లగాను
     గంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
     విశ్వదాభిరామ వినరవేమ."