పుట:Abraham Lincoln (Telugu).pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"పరపక్షపు వేగులవాడు, వేగులవా డ"ని యితరులు గర్జించిరి.

ఈ రావములచే దిగ్భ్రమజెంది యావృద్ధుడు దనచేత నున్న యొక కాగితపు ముక్క దిగ విడచి చదువుకొను డనెను. నాయకమణి లింక నది చదివి సేనా నాయకుడు క్యా సిచ్చిన యోగ్యతా పత్రిక యగుట దెలియ జేసెను.

"సృష్టింపబడిన యసత్యపులేఖ"యను నఱపులు దట్టమాయె.

"ఇట్టి మాయలు మము గలంచునే" యని కోపమున బలుకుచు బిల్లి తుపాకి నెత్తి ముసలివాని గాలువ జంకించెను.

వా రెల్లరు 'ఇందియను' జీవము గొన బట్టువట్టిరి. అందఱు గుమిగూడి వానిపై బడ బోవుచుండిరి. అపుడు దటాలున లింకను వారిముందఱికి దుమికి తన దేహముచే నిందియనును గప్పి "సేనాధ్యక్షుని యుత్తరు వాలించి తీరవలయును. వాని మీరు దాక గూడదు. నిలుం డని" యాగ్రహమున వారింప జూచెను.

అందులో నొక దుర్మార్గుడు "మే మిదె వాని యుసుఱుల దీయ నిశ్చయించితి" మనెను.

లింకను గనలి భీకరాకారమున నిలచి వారిం దృణీకరించుచు "నను గాల్చినం గాని వాని జేరలే"రని మహారావమున ననియెను.