పుట:Abraham Lincoln (Telugu).pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యపాయములకు దలయొగ్గి రాత్రింబవళ్లు త్రోవ నడవవలయునని విని "పసివాడ వీ వెట్లు పోగల్గుదువో" యని యాబ్రహాము దల్లి కొంచె మనిష్టము గనుబఱచి "అయినను నీ కీ ప్రయాణమున జయము గలుగుగాక. లోకజ్ఞాన మిందుమూలమున గొంత యలవడుగాక. ధైర్యస్థైర్యము లింకను గుదురుగాక. దేవు డెప్పుడు నీకుసాహాయు డగు గాకని" పంపెను.

ప్రయాణ సన్నాహములు వెనువెంట జేయ బడియెను. అచటి రేవున నొక పడవ యాయత్త మాయెను. ఆబీ యాలెనులు దమ సరకులతో మిసిసిప్పి నదిపై దేల మొదలిడిరి. ఆబ్రహాము దెప్ప ముందుకు నడప మొదలిడెను. ఈ నవీనానుభవ మాబ్రహామునకు మిక్కిలి యాహ్లాదకారి యాయెను. తా నిదివఱకు జూడని ప్రపంచపు వింతలెల్ల నప్పు డతనికి జూడ గల్గెను. ఆ గొప్ప జలసముదాయముపై నూగాడు చుండుటచేతను నూతనవిషయముల బరికింపుచుండుటచేతను నతడు ప్రపంచపరిమాణ మిట్టిదిగదా యని యూహించు కొనుచు సర్వకర్తయగు నా సర్వేశ్వరు మహిమాతిశయంబుల గ్రహింప దొడగెను.

దారియందు వారి కనేకానుభవములు ప్రాప్తించెను. వాని వన్నిటి నిచట వివరింప నలవిగాదు. వారి గాలమంతయు నాపడవపైన గడపబడుచుండెను.