పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహారాణిస్వర్ణమయి.

289

విషయమయి తమరి నెంత కొనియాడినను దక్కువయే. ఈ దేశమునందు దానపరులలో నిష్కామబుద్ధిచే దానము చేయువారు బహుస్వల్పముగా నున్నారు. కడమ వారందఱును సహాయము చేయవలసిన కార్యముయొక్క యోగ్యతను జూచి ధన మీయక తమకత్యంత కీర్తి కలుగవలెనను నభిలాషచేత ధర్మముఁ జేయుదురు. తమరుమాత్ర మట్లుగాదు. తమరు కుడిచేతఁ జేయు దానము నెడమచేతి కయినను దెలియకుండఁ జేసెదరు..........ఒక్కదాన ధర్మములయందేకాక మీరు సంస్థాన నిర్వాహకత్వమునందును దక్షత చూపించుచునే యున్నారు. అందువలననే మీజందారీ కడమవానివలె యప్పులలో మునిఁగి తేలుచుండక దినదినాభివృద్ధిఁ గాంచుచున్నది."

ఇట్లు పీకాకుదొరవారు చెప్పినవానిలో నేదియు నతిశయోక్తికాదు. ఈమె చచ్చుటకు బూర్వము కొన్ని సంవత్సరములనుండియుఁ దనయాదాయమునుండి ప్రతి సంవత్సరము ఒకలక్షరూపాయలు లోకహితకార్యములకయి వ్యయపఱుప నిశ్చయించియుండిరి. దేశమునం దెచ్చట నేయాపద సంభవించినను లేక మఱి యేపుణ్యకార్యము చేయవలసి వచ్చినను స్వర్ణమయిగారు తా ముందడుగిడి వెనుకఁదీయక ధనమును వ్యయపఱుచు చుండిరి. ఇట్టి వనితలే కదా తమ సుగుణముల చేత నొక తమదేశపు గరితల కేకాక ప్రపంచమం దంతటనున్న స్త్రీ వర్గమునకు గౌరవమును గీర్తియును దెచ్చెదరు. ఈసద్గుణరాశి 1897 వ సంవత్సరమున పరలోకమున కేఁగెను. ఈమె యనంతరము రాజ్య మీమె యత్తగారి వశమయ్యెను.