పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహారాణి స్వర్ణమయి

బరద్వాన్ ప్రాంతమునందున భట్టకోలను గ్రామమునందు నీచరిత్రనాయిక యగు మహారాణిస్వర్ణమయిగారు 1827 వ సంవత్సరమున జన్మించిరి. 1838 వ సంవత్సరమున నీమెకు పదునొకండు సంవత్సరములప్రాయము వచ్చినందున నీమెను కాసిం బాజారు రాజకుటంబములో విఖ్యాతిగాంచిన రాజాకిసన్నాధ రాయబహద్దరుగారికి నిచ్చి యీమె జననీజనకులు వివాహముచేసిరి. స్వర్ణమయి భర్తయగు రాజా కిసన్నాధరాయ బహద్దరుగారు రాజవంశస్థు లగుటచేత మహారాణిగారికి మిగుల మంచి సంబంధము దొరకెనని చెప్పుటకు సందియము లేదు. కాని పాప మామె యీభాగ్యము చిరకాలమనుభవించుటకు నోచుకొనఁదయ్యెను. వివాహానంతరము కొద్దిదినములకే రాజాగారికి మనోభ్రమణము గలిగినందున వారు 1884 వ సంవత్సరమున నాత్మహత్మచేసికొనిరి. లేతవయస్సునందే మహారాణికిదియెట్టి ఘోరదు:ఖముప్రాప్తించెనో చదువరులే యుహించుకొనఁగలరు. పతిమరణమేకాక యింకొక గొప్పయాపదకూడ నీమెకు సంప్రాప్తమయ్యెను. ఆమె పెనిమిటి మతిభ్రమణము గలిగి మృతినొందినందున నాయనదనయాస్తిని నంతను నప్పుడు రాజ్యము చేయుచుండిన "ఈస్టు ఇండియాకంపెనీ" వారికిఁ జెందునట్టుగా తనమరణశాసనమునందు వ్రాసిపోయెను. కాని