పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/294

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
280
అబలాసచ్చరిత్ర రత్నమాల.

బిడ్డను గని సంతతి లేనివాఁ డగుటవలన నాబాలను గొనిపోయి పెంచి విద్యాబుద్ధులు చెప్పుచుండెను.

ఇచటఁ గొన్నిదినములకు విధివశమున వేదమౌళి గతించెను. అందువలన నాతని పుత్రుఁడగు పిరలీ విద్యాభ్యాసమునకై విదేశమునకుఁ బోవలసినవాఁ డాయెను. అట్లాతఁడు తిరుగుచు నీ పిల్లయున్న బ్రాహ్మణునియింటికివచ్చెను. ఆబ్రాహ్మణుఁ డా చిన్న వానికిఁ దన పెంపుడుకూఁతు నియ్యఁదలఁచి యాతనిం దనయింట నుంచుకొని సమస్తవిద్యలు గఱపెను. అటుపిమ్మట నాబ్రాహ్మణుని పెంపుడు కూఁతునకును, పిరలీకిని వివాహమయి వారు అన్యోన్యానురాగము గలిగియుండిరి. ఇట్లు కొన్ని దినములు గడచినపిదప నొకదిన మా చిన్నది దొరికిన సంగతి పిరలీకిఁ దెలిసెను. అంత నాతఁడీ చిన్నది తనతండ్రి కావేరిలో విడచిన మాలపిల్లయని తెలిసికొని మిగుల చింతించి భార్యకును, మామగారికిని దెలియకుండ నొక నాఁటిరాత్రి లేచి పలాయితుఁడయ్యెను. మఱుసటిదినమున నాకన్యక తనభర్తను గానక చింతనొంది మిగుల వృద్ధగు తనతండ్రి యాజ్ఞనుబొంది పెనిమిటిని వెదకఁబోయెను.

ఇట్లామె వెదకుచుంబోయి యొకచోట నాతనిఁగనెను. అప్పు డామె యింటికిరండని యెంత వేఁడుకొనినను పిరలీ విననందున నాచిన్నది విసిగి యాతనితో నరుగసాగెను. ఇట్లాదంపతులు కొన్నిదినము లరిగినపిదప నొకచోట భార్య నిదురించియుండఁగా నామెను వదలి పిరలీ మరల నరిగెను. తదనంతర మామె లేచి తనప్రాణేశ్వరుని వెదకుచుండెను. ఇంతలో నొకధనవంతుఁ డామె కగుపడి