పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విద్వత్కుటుంబము

ఈకుటుంబమున నందఱును విద్వాంసులేగాన దీనికిపేరు పెట్టితిని. ఈకుటుంబమును గుఱించి నమ్మఁదగిన చరిత్ర మెక్కడను దొరకలేదు. కానిలోకులు వీరి కధ నిట్లు చెప్పుదురు. పూర్వము ద్రావిడదేశమున వేదమౌళి యను భవిష్యవాదియొక్కడుండెను. ఆయన యొకదినమురాత్రి తనవాకిట నిలిచియుండఁగా నొకనక్షత్రము మాలవాడ వైపున రాలుటఁ జూచెను. మఱుసటిదినమున నిద్రలేచి వేదమౌళి మాలవాడలో నెవరయిన నీళ్ళాడిరాయని తెలిసికొనఁగా నాఁటిరాత్రి యా చుక్క రాలిన సమయముననే యొకమాలదాని కొకయాఁడు బిడ్డ పుట్టెనని తెలియవచ్చెను. అది విని యావిప్రుఁ డాకన్యక తనకోడలగునని తెలిసికొని మిగుల చింతించెను. అంత నాతఁడు కులమువారి సమ్మతిని ఆపిల్ల తండ్రిని రప్పించి నీబిడ్డను విడిచెదవా లేక బ్రాహ్మణకులమును నాశము చేసెదవాయని యడుగఁగా వాఁడు బ్రాహ్మణకులమును జెఱుప నిష్టములేక తనకూఁతుఁ దెచ్చి యాబ్రాహ్మణునకు నొప్పగించెను. అప్పుడాయన నాశిశువును జంపనొల్లక నొకపెట్టెలో భద్రపఱచి యాపెట్టెను కావేరిలో విడిచెను. ఆపెట్టె కావేరిలో బహుదూర మరిగి యొకఘట్టమునం జేరెను. ఆఘట్టమునం దపుడొక విద్వాంసుఁడు స్నానమునకు వచ్చి యాపెట్టెలో నున్న యా