పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/28

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
14
అబలాసచ్చరిత్ర రత్నమాల.

వురుపుత్రులతోడఁదనను గెలువవచ్చుచున్న దనినవార్త అహమదాబాదఠాణేదారుఁడగు జోరావరఖాన్ బాబీయను నాతఁడు విని ఉమాబాయి కిట్లు వర్తమాన మంపెను. "నీవు అనాధవు; స్త్రీవి; నీపిల్ల లిరువురును అల్పవయస్కులు; గాన నీవు సైన్యసహితముగాఁ దిరిగి వెళ్లుటమంచిది. లేకున్న మేము మాతురకలప్రతాపముఁ జూపకమానము." ఈవార్తగల యుత్తరమును గని యుమాబాయియొక్క శౌర్యాగ్నిమరింత ప్రజ్వరిల్లెను. అంత నామె యీమ్లేచ్ఛుని గర్వమడఁచిననేగాని నేను భోజనము సేయను; అని ప్రతినపట్టి తనయొద్ది సరదార్ల నందఱిని బిలిపించి యొకసభచేసెను. సభ కందఱును వచ్చుటకుఁ బూర్వమే యామె పసపు, కుంకుము, గాజులును తెప్పించి సభామధ్యంబున నుంచెను. సభికు లందఱు వచ్చినపిదప నామెజోరావరఖాన్ బాబీ వ్రాసినయుత్తరము వారికి వినిపించి యిట్లు వక్కాణించెను. "ఇందుపైని అహమదాబాదు కిల్లాను జయించి యచటనే భోజనము చేయుదునని నిశ్చయించితిని. మీరందఱును నేటివఱకు నా యన్నము దినుచుండినవారలు; గాన నాప్ర్తినయందు నాదరమును అభిమానమును గలవారేని మరణమునకు భీతిల్లవలదు. తత్క్షణమే మీతల నఱచేత నుంచుకొని నాతో యుద్ధభూమికిఁ జనుదెంచి మ్లేచ్ఛులతోఁ బోరాడుటకు సన్నద్ధులగుఁడు. లేక ప్రాణ భయముచే భీతిల్లెదరేని ఇచటనున్న పసపు, కుంకుమ పెట్టుకొని చేతికి గాజులు తొడుగుకొని మీమీగృహముల కరిగి బ్రతుకుఁడు." ఇట్టివాక్యములు వినినపిదప యుద్ధమునకు జంకువాడాసభ యం దొకఁడును కానరాఁడయ్యెను. కాన వారంద ఱాక్షణముననే యుద్ధసన్నద్ధులై పగఱపై దండువెడలిరి.