పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

258

అబలాసచ్చరిత్ర రత్నమాల.

రనియు, గురువువలెహితోపదేశము చేయవలెననియు, వైద్యునివలె శరీరారోగ్యమును కాపాడవలయు ననియు చెప్పియున్నారు.

ఇటువంటిపనులను యుక్తముగా నిర్వహింపఁ గలుగుటకు స్త్రీ లెంతటి విద్యావతులుగా నుండవలయునో చెప్పుటకంటె నెవరికి వారూహించుకొనుటయే సులభముగా నుండును. జ్ఞానమూలమయిన విద్యానిక్షేప మేహేతువుచేతనో క్రమక్రమముగా మనదేశపు స్త్రీలనువిడిచిపోయినది. ఆవిద్యాధనముతోనే వారికిఁగల సమస్తలాభములును, సమస్త స్వాతంత్ర్యములును క్రమక్రమముగా నశించుచు వచ్చినవి. కడపటస్త్రీలకు విద్య కావలయునా యని సంశయపడునంత దురవస్థ మనదేశమున కిప్పుడు పట్టినది. స్త్రీలు విద్యాహీనురాండ్రగుటచే మూఢత్వములో మునిఁగియుండి సంసారభారమును చక్కఁగా నిర్వహించుటలో మునుపటివలె పురుషులకు సహాయురాండ్రుకాఁ జాలకున్నారు. అందుచేత పురుషులకు స్త్రీలయందు పూర్వకాలమునందుండెడు గౌరవమంతయు తగ్గిపోయినది. ఏవిషయమునం దయినను స్త్రీల నాలోచన యడుగుటయే యనర్థదాయకమని సామాన్యముగా పురుషు లిప్పుడు భావించుచున్నారు. అందుచేత పురుషు లనేకులు స్త్రీలయొక్క యభిప్రాయమునుగాని అంగీకారమునుగాని పొందకయే వారిని వివాహమను మిషమీఁద నంగహీనులకును, వృద్ధులకునుగూడఁ గట్టిపెట్టుచున్నారు; మానవదేహమున కలంకారమయిన విద్యాభూషణము వారికి లేకుండఁ జేసిలోహపు నగలనుమాత్రము పెట్టి తమవేడుక నిమిత్తమయి వారిని తోలుబొమ్మలవలెఁ జేయుచున్నారు; వారిని గృహ యజమానురాండ్రనుగాఁ జూడక