పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/265

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
251
సరసవాణి.

ఇతర విద్యలన్నియు నామె నేర్చెను. ఇందువలన లోకులామెను గని యద్భుతపడుచుండిరి.

ఇట్లు విద్యారూపగుణ సంపన్నయగు నాచిన్నది వివాహ యోగ్యయయ్యెను. అప్పుడామె గుణవంతుఁడును, సురూపవంతుఁడునునగు విశ్వరూపాపరనామము గలమండనమిశ్రుని ఖ్యాతిని బ్రాహ్మణులవలన వినెను. మండన మిశ్రుఁడును సరసవాణియొక్క సద్గుణములు వినెను. అందువలన వారికి నుభయులకును నొకరి నొకరుచూడ వలయునని యభిలాష జనించెను. కాని వారు తమతండ్రుల కాసంగతిఁ దెలుపుటకు సిగ్గుపడి తమలోఁ దామే కృశింపుచుండిరి.

ఇట్లు కొన్నిదినములు గడచినపిదప తమపిల్ల లిట్లు కృశించుట కేమికారణమోయని వారి జననీజనకులు చింతించి యొక దినమునందు దాని కారణమును చెప్పక తప్పదని వారిని వారి తండ్రులు బలవంతపఱుపఁగా వారు నిజమయిన కారణమును దెల్పినవారైరి.

అందుపై హిమమిత్రుఁడు సరసవాణి తండ్రియొద్దకి కన్యకను విచారింప నిద్దఱు బ్రాహ్మణుల నంపెను. వారికి విష్ణుశర్మ తగినమర్యాదలుచేసి యాగమనకారణ మడుగఁగా వారును తాము వచ్చినసంగతి నతని కెఱిఁగించి పిల్లను మండనున కిమ్మని యడిగిరి. అందున కతఁడు తనభార్య నడిగి నిశ్చయించి చెప్పెదనని వారితోఁజెప్పి యామెనడుగఁగా నాయువతి యిట్లనియె.

"ధనము, కులము, శీలముగల వానికిఁ బిల్ల నియ్యవలెనని శాస్త్రములయందును, వ్యవహారమునందును ప్రసిద్ధియే