పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మైసల దేవి

ఈయుదాత్తచరిత 1072 వ సంవత్సరప్రాంతమునం దుండెను. విదర్భదేశమున చంద్రపురంబు గలదు. అచటి రాజగు జయకేశునను మైసలదేవియను కూఁతురు కలదు. ఈమె యుక్తవయస్కురాలు కాఁగా తండ్రి యామెకొఱకు సకల రాజపుత్రుల పటములను దెప్పించెను. వానిలో ఘూర్జరా (గుజరాతి) ధిపతియును, చాలుక్యవంశీకుఁడునగు కర్ణరాజు రూప మామె కధిక ప్రియమగుటవలన నామె తనపటము నొక విప్రునకిచ్చి యారాజున కంపెను. కర్ణుఁడును మైసలదేవి సౌందర్యమును మెచ్చుకొని యావిప్రుని మిగుల సన్మానించి యామెను వివాహమాడ సమ్మతించెను. ఆవార్త దెలిసినవెంటనే మైసలదేవి ఘూర్జరదేశమున కరుగఁగా నచటనే కర్ణ రాజునకు నామెకు వివాహమయ్యెను. వివాహానంతరము రోజు క్రొత్తపుష్పము నాఘ్రాణించు పురుషస్వభావము ననుసరించి కర్ణ రాజునకు మైసలదేవియందలి ప్రేమతగ్గెను. అట్టిసమయమునందు మైసలదేవికిఁ గలిగిన దు:ఖమువలన నామె యనేక పర్యాయములు జీవితముపై రోసెనుగాని యత్తగారి హితబోధవలనను, ఆత్మహత్య దోషమని యెఱిఁగిన దగుటవలనను ఆమె యెన్నఁడును తనమరణమునకుఁ బ్రయత్నముచేసినది కాదు. ఇట్లు కొన్నిదినము లరిగినపిదప ముంజలాయను భోగకాంతపై రాజునకుమక్కువగలదని ముంజలుఁడను మంత్రికిఁదెల్యఁగానాతఁ