పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

228

అబలాసచ్చరిత్ర రత్నమాల.

లయిన యుపవాసాదివ్రతములతోఁ బ్రయోజనములేదు. పాతివ్రత్యరక్షణమొక్కటే పడఁతులకు పరమోత్కృష్టవ్రతమని ధర్మశాస్త్రములు విధించుచున్నవి. దేవతాచార్యుని భార్యయైన తారాదేవి బుద్ధిమాంద్యముచేత చంద్రునితో వ్యభిచరించినందునఁగదా శాశ్వతమయిననింద ననుభవింపు చున్నది? చేడియలతోఁగూడి జలక్రీడసలుపుచున్న చిత్రరధునిఁ జూచి భ్రమసినందునఁగదా రేణుకాదేవి తనపాతివ్రత్యమును భంగము చేసికొని యిసుకతోఁ గుండను జేయలేక తుదకు ఱట్టువడి పరశురామునిచేత ఖండింపఁబడినది? ద్రౌపదీదేవి కర్ణుని యందుఁ గన్నిడినందునఁగదా తపోధనున కుపయోగపడు ఫలమును వృక్షమున కెక్కింపలేక సిగ్గుపడినది? కాఁబట్టి యత్నపూర్వకముగా పాతివ్రత్యమును రక్షించుకోవలసినది స్త్రీలకు ముఖ్యకర్తవ్యము. మృతులయినవారిని మరల బ్రతికింపవలె నన్నను హరిహరబ్రహ్మలను రక్షించవలనన్నను భూతముల నెల్లఁ దలక్రిందులుగాఁ జేయవలెనన్నను పతివ్రతల కొక లక్ష్యముకాదు. పాతివ్రత్యము బ్రహ్మనిష్ఠతో సమానమని పెద్దలు పలుకుదురు. సర్వోత్కృష్ట మగు బ్రహ్మనిష్ఠపురుషులకుఁ జిత్తశుద్ధిని గలిగించి పూజ్య మగు మోక్షసామ్రాజ్యము ననుగ్రహించునట్టే పాతివ్రత్యము సతులకు పరమపదము నొనగూర్చును. ఏకపత్నీవ్రతు లగువారికి నన్యస్త్రీసహవాస మెట్లు విసర్జనీయమో ఆప్రకారమే పతివ్రతలకు సహితము పరపురుషసాంగత్యము సర్వదావర్జనీయము. ఏకాంతమున నేకాసనమున నిందు కొమారునితో నైనను గూర్చుండుటకు కులభామినికి యుక్తముగాదు. ధనికుఁడయినను, నిర్ధనుఁడయినను, రూప