పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

208

అబలాసచ్చరిత్ర రత్నమాల.

జయము నొంది పలాయితుఁ డయి వచ్చినవార్తవిని రాణి తన నేమనునో ముఖమయినను జూచునో లేదో యని స్వభార్యయొక్కక్షాత్రతేజము నెఱిఁగినవాఁడుగాన నాతనికి శంక కలిగెను. అదేప్రకార మాయన గ్రామమును సమీపించినతోడనే రాణి పట్టణపు సింహద్వారములు మూయించి యాతనిని పట్టణములోనికి రానియ్యక పోయెను.

నగరద్వారములను మూయించి యామెభర్త కిట్లు వర్తమాన మంపెను : _ "జోధపురాధీశ్వరుఁ డపజయమునుబొంది తనదీనముఖము నగరవాసులకుఁ గనుపఱుపకుండిన నే మంచిది. ఇట్టిపిఱికివానికి భార్యనైతినని నాకే మిగుల సిగ్గుగా నున్నది. జోధపురాధిపతియై మేవాడరాణాకు అల్లుఁడును నగువాఁడాజిని పరాజయమును బొందిపాఱివచ్చుటకంటె హీనత యే మున్నది?" ఇట్లని యామె యంతటితో నూఱకుండక సేవకులతో "చీతిఁ బేర్చుఁడు. జోధపురాధిపతి పరాజయమునుబొంది తిరిగి వచ్చుట సంభవింపదు. ఆయన యిదివఱకే శత్రువులచేఁ జంపఁబడియుండును. నేనుత్వరగా నాభర్తను గలియఁ బరలోకమున కేఁగెదను" అని చెప్పెను.

ఈప్రకారము వారముదినములు గడచినపిదప నీసంగతి నంతను విని యామె తల్లి జోదపురమునకు వచ్చెను. ఆమె వచ్చి కొమార్తె కనేకవిధముల బోధించి యిప్పు డపజయము పొంది వచ్చినను జసవంతసింగు మరల సైన్యసహితుఁ డయి పోయి శత్రువులతో సంగ్రామ మొనరించునని చెప్పెను. ఇట్లు తల్లిచేఁ బ్రబోధిత యయి యారాణి నగరద్వారములు తీయుట కాజ్ఞ యిచ్చెను. జసవంతసింగు డింటికి వచ్చినపిదప నాతని