పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జోధపురపు రాణి

ఈరాణి ఔరంగజేబుబాదుషా రాజ్యారంభమునందు ననఁగాఁ బదు నేడవశతాబ్దమధ్యమున నుండెను. శహజహన్ బాదుషా రాజ్యదినములలో మార్వాడదేశమునందలి జోధపుర రాజ్యమును జసవంతసింగుఁడను రాఠోడవంశీయుఁ డగురాజు పాలింపుచుండెను. ఈయన పత్నియొక్క ధైర్యస్థైర్యములును స్వాభిమానమును మిగుల శ్లాఘనీయములు ఆమెపే రెచటను కానరాదు. కానియామె చేసినకార్యము లనేక దిక్కుల వర్ణింపఁబడినవి.

ఈజసవంతసింగు డిల్లీపతియగు శహజహానునకు సామంతుఁడయి యుండెను. జసవంతసింగు మిగుల పరాక్రమ వంతుఁడయి ఔరంగజేబును ఉత్తరమునకు రానియ్యక మాళ్వా ప్రాంతముననే బహుదినములవఱకు సంగ్రామము చేయుచు నాపెను. అప్పుడాయవరంగ జేబు తండ్రియగు శహజహనుని పదచ్యుతినిఁ జేయు తలంపుతో సహోదరసహితుఁ డయి డిల్లీకిఁ జనుచుండెను. త్రోవలో నుజ్జయనీయం దాతనిని జసవంతసింగు డాపఁదలఁపఁగా నాయిరువురకును ఘోరయుద్ధము జరిగెను. ఆయుద్ధమునందు సైనికులందఱు సమయుట వలన జయము కలుగునని ఆశలేక జసవంతసింగు మరలి తన నగరమునకు వచ్చుచుండెను. గ్రామమును సమీపించినకొలఁదిని ఆతని కొకవిధమయిన భీతి జనించెను. ఏలయనఁగా తాను పరా