పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200

అబలాసచ్చరిత్ర రత్నమాల.

సుగుణమణియగుపత్ని యనేకవిధముల హితములు బోధింపుచున్నను ప్రతాపాదిత్యుఁడు వాని నన్నిఁటిని పెడ చెవులఁ బెట్టి దుష్ప్రవర్తనమును మానకుండెను. ఆతఁడుద్రవ్యాశచే మిగుల సైన్యమును తోడుకొని పల్లెలు, పట్టణములు కొల్లగొట్టసాగెను. ఆతని వర్తనము నెఱిఁగి కొందఱుబందిపోటు దొంగలాతనికి సహాయులు కాఁగానాతఁడు దక్షిణ బంగాళాదేశమునం గలసామంతరాజులను, జమీం దార్లను, కొల్లగొట్టితానువారికి ప్రభువునని వారిచేఁగప్పములఁ గొనుచుండెను. ఆయనకు బుడుతకీచులు (పొరుచుగీజులు)ను తోడుపడుటచే నాతఁడు బంగాళా ప్రాంతమునకు సుబేదారుగానుండిన మహమ్మదీయునికి సహితము మిగుల దుస్సాధ్యుఁడుగా నుండెను. తుద కాతఁడు బాదుషాకు పన్ను గట్టక స్వతంత్రతను వహించెను.

ఆదుష్టుఁ డంతటితో నయిన నూరకుండక పినతండ్రియగు బసంతరాయులయెడ ద్రోహము తలఁచెను. బసంతరాయులు మిగుల సజ్జనుఁడును రాజవంశమునందలి వృద్ధుఁడును నగుటచే ప్రజ లాతనియం దధిక భక్తిగలవాఁరై యాతనిని విశేషముగా గౌరవింపుచుండిరి. ఆభీష్మునకుఁ దనయన్న కుమారుని చేష్ట లెంతమాత్రమును నిష్టము లేక యనేక పర్యాయము లాతనికి బుద్ధి చెప్పి చూచెనుకాని, యందువలన ఫల మెంతమాత్రమును గలిగినదికాదు. ప్రతాపాదిత్యుని కాతనిమాటలవలన ద్వేషము గలిగి తనప్రజలు పినతండ్రియొక్క సత్స్వభావము నెఱిఁగి తననుపదచ్యుతులను జేసి రాజ్యమాతని కిచ్చెదరేమోయని తలఁచి యాతనిఁజంప నిశ్చయించెను.