పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

174

అబలాసచ్చరిత్ర రత్నమాల.

నని ధనమును విచ్చలవిడిగా వెచ్చింపఁ దొడఁగెను. అందువలన నాతని సొంతధనము సహితము సంస్థానపు బొక్కసములో భద్రపఱచవలసి వచ్చెను. 1813 వ సంవత్సరము రాజు కాలముచేసెను. తదనంతర మతనిపుత్రుఁడగు కర్‌మసింహుఁడు రాజ్యారూఢుఁ డయ్యెను. కర్‌మసింహుఁడు బాలుడని యాతని పేర రాణి కొన్నిదినములు రాజ్యము నేలెను. కాని కొమారుఁడు పెద్దవాఁడయినపిదప నతఁడు రాజ్యమును తన్నేలనిమ్మనఁగా రాణియందుకు సమ్మతింపక పుత్రునితోఁ గలహించెను. అంత నామెపుత్రుఁడామెకుఁ గొంతధన మిచ్చి సమాధానపఱచి యామెను వేఱొకచోటి కనిచి తానురాజ్యము నేలుచుండెను. ఇంతటితో నీమె రాజ్యపాలనచరిత్రము ముగిసెను. ఈరాణికొంచెము మహత్త్వకాంక్ష గలదియైనను నది సమర్దులకు సహజగుణము గాన నొకదోషముకాదు. ఇదిగాక నీమెయందు వసియించు ధర్మనీతి సత్యములును, స్వాభిమానమును, పరహితేచ్ఛయు, రాజ్యపాలనసామర్థ్యము మొదలగు సద్గుణములు మిగుల శ్లఘనీయములు.

ఈచరిత్రమువలనను, నిదివఱకు వ్రాయఁబడిన రాజ్య పరిపాలనమునం దధికనిపుణురాండ్రయిన రాణుల చరిత్రము వలనను, నిఁక ముందువచ్చునట్టి చరితములవలనను స్త్రీలురాజ్య పాలనమునం దధికసమర్థురాండ్రనియు, వా రనేకపర్యాయములు పురుషులు తమబుద్ధిహీనతవలనఁ జెడఁగొట్టిన కొన్ని సంస్థానములను బాగుపఱచి రనియును దెల్లముగాఁ దెలియుచున్నది. ఇందును గుఱించి యీశతాబ్దమునం దుండి పోయిన యింగ్లండులోని యొకతత్త్వవేత్త యిట్లు నుడివెను : _