పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/18

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
4
అబలాసచ్చరిత్ర రత్నమాల.

విడియుట విని యాతనినిఁబట్టి తెండని జయచంద్రుఁడు మూడువేలసైన్యము నంపెను. కహరకంఠీరుఁ డనువాని ముందిడుకొని శత్రుసైన్యములు తమవైపునకు వచ్చుటఁ గని పృధివీరాజును వారితోఁబోరుటకు సిద్ధముగా నుండెను. తదనంతర మారెండుసైన్యంబు లొండొంటిం దాఁకి మిగుల ఘోరంబుఁగా బోర సాగెను. అందుఁ బృధివీరాజు సేనానియగు ఆతతాయికిని జయచంద్రుని సైన్యాధిపతియగు కహరకంఠీరునకును ద్వంద్వయుద్ధంబు ప్రాప్తించెను. ఆశూరు లిరువురును సింహనాదములు చేయుచు నొండురులతో నెక్కుడు పంతంబులు పలుకుచు నొకరినొకరు నొప్పించుచుండిరి. అంతఁ గొంతసేపటికి భటుల యొక్కయు, గుఱ్ఱములయొక్కయు, నేనుఁగులయొక్కయు, దేహములనిండ కారురక్తము ప్రవాహమయి పాఱఁదొడఁగెను. అట్టిసమయమున కహరకంఠీరుని రోషావేశ మధిక మయినందున నాతఁడు తనరధంబుడిగ్గి ఆతతాయిని తనఖడ్గమునకు బలియిచ్చి పృధివీరాజు కంఠముఁ తెగ నేయ నుంకించెను. కహరకంఠీరుని శౌర్యమున కోడి పృధివీరాజు బలంబులు చెదరి పాఱసాగెను. అట్టిసమయంబునం దాకస్మికముగా నొకశౌర్యనిధి యచటికివచ్చి పృధివీరాజు కంఠముపైఁ బడ నున్న ఖడ్గమును దునియలుచేసి యాతనిఁ గాపాడెను. ఈపరాక్రమవంతుఁ డెవఁడో యొక రాజపుత్రుఁడని చదువరులు భ్రమపడవలదు. అట్లు తన సాహసమువలనఁ బృధివీరాజును గాపాడినది యాతనిపత్నియు జయచంద్రునికూఁతురు నగు సంయుక్తయే. ఆమె తనభర్తను గలసి యాతనితో వెళ్ళవలయునని బహుప్రయాసముతోఁ గారాగృహమువెడలి యతియోగ్యమైన సమయమున నాస్థలము