పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

అబలాసచ్చరిత్ర రత్నమాల.

ము ప్రేమానందును విడిపించెను. కారాగృహమునుండి బైటికి వచ్చినపిదప పురుష వేష ధారిణియగు తనసతినిఁజూచి ప్రేమానందుఁడు గుర్తింపక తనబంధువుఁ డెవఁడో తనను విడిపించెనని తలఁచెను. తదనంతరము వారు గృహమునకు వచ్చినపిమ్మట సత్యవతి భర్తకుఁ దన నెఱిఁగించి యతని పాదములపైఁబడెను. అంత ప్రేమానందుఁడును తనసతి చేసిన యద్భుతకృత్యమున కచ్చెరు వంది యామె నాలింగనము చేసికొనియెను. మృతుఁడయ్యె నను కొనిన ప్రియభర్తను పండ్రెండుసంవత్సరములకుఁ గాంచెనుగాన సత్యవతి సంతోషమునకుఁ బారము లేదయ్యె. తదనంతరమువా రిరువురును భృత్యుని వెంటఁ దీసికొని కొన్ని దినములకు రామానందుఁడును యోగినియు నున్నస్థలమునకువచ్చిరి. అప్పుడు రామానందుఁడు పరమానందమగ్నుఁడయి కోడలిని బహువిధముల నుతియించెను. అంత వా రందఱును రంగపురమున కరిగి సుఖముగానుండిరి.