పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యవతి

151

ఆకాలమునం దాదేశమున కంపనీవారి ప్రభుత్వము క్రొత్తగాఁ బ్రారంభ మయ్యెను. ఆసమయమున ననావృష్టి దోషమువలన నాదేశమున నొకగొప్పక్షామంబు సంభవించె. ఆక్షామంబున పంటలులేక కాపులు మిగుల హీనస్థితికి వచ్చిరి. కాని దొరతనమువారి యుద్యోగస్థులు, దొతనమువారి కియ్యవలసిన పన్నుకొఱకయి కాపుల యిండ్లనమ్మియు, పొలములను విక్రయించియు పన్ను దీసికొని వారి ననేక బాధలఁ బెట్టుచుండిరి. వాండ్రను రక్షకభటుల కొప్పగింపఁగా వారు వారిని, వారి స్త్రీలను సకలబాధలపఱిచి సభలలో నవమానింపుచుండిరి. ఇట్టిసమయములో నదివఱకు మాన్యముగా నిచ్చిన రామానందుని భూమికి నచటి యుద్యోగస్థుఁడగు దేవీసింహుఁ డన్యాయముగా పన్ను నడిగెను. అప్పుడు రామానందునివద్ద ద్రవ్యమేమియు లేనందున నాయధికారి వారి యింట నున్న వస్తువులన్నియు వేలము వాడెను. అట్టియాపత్సమయములో రామానందుఁడు తనపరివారముతోడ రంగపురమున తనశిష్యు లుండినందున, నచటికిఁ బోవుచుండెను. కాని రాజభటులు వారి నందఱిని త్రోవలోఁ బట్టుకొని రాజస్థానమునకుఁ దీసికొనిపోయిరి. అచటఁ గులాంగనల లొందు నవమానమును జూచి సహింపలేక ప్రేమానందుఁడు దీని కంతకును కారణుఁ డగుదేవీసింహుని తనచేతికత్తితో నఱకఁబోయెను. కాని యింతలో రాజభటుఁ డొకఁడు వచ్చి యతని చేయిపట్టుకొనియెను. అంత నా రాజభటుఁ డొకగదిలోని కతనిఁ దీసికొనిపోయి వీపుపైని లెక్కలేని దెబ్బలను గొట్టెను. అదివఱ కట్టి దెబ్బలచేత నలుగురుమనుష్యు లచట మృతు లయిరి.