పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యవతి.

బంగాళాయిలాకాలోని మాల్ హదనీ యనుప్రాంతములోనిదగు గౌడమగ్రాసు నివాసియగు రామానందగోస్వామికి నీమె కోడలు. గోస్వామిభార్య పేరు సునీతి. ఈమె మిగుల దయగలది యయి యింటిపని నంతను జేసి యూర నెవ్వరును క్షుత్తుచే బాధపడుచుండలేదుగదా యని తెలిసికొనినపిదప పతి సుతులకుఁ గుడువఁబెట్టి పిదపఁదాను భుజించును. రామానందుఁడు భగవద్భక్తుఁడు, పాపభీతుఁడునై తనకుఁ గలమాన్యములో వచ్చినవానితో జీవనము చేయుచు సింతుష్టుఁడయి యుండెను. రామానందుఁడు తనపుత్రు డగు ప్రేమానందునికి విద్యాబుద్ధులు గఱపి సద్గుణవంతునిగాఁ జేసెను. వారికోడలగు సత్యవతి మిగుల రూపవతి యగుటయేగాక విద్యావతియయి వినయ వివేకాదిసద్గుణనిధిగా నుండెను. ఈమె రాణీభవాని కాలమునందుండినట్లు తెలియుచున్నది. సత్యవతి యత్తమామలకు సేవచేయుచుఁ బతి యాజ్ఞను శిరసావహించి మిగుల నమ్రతతో నుండుటవలన వారును ఆమెయం దధికాదరము కలవారలయిరి. ఇట్లీకుటుంబమధిక సుఖములో నుండఁగా వారి కకస్మాత్తుగా నొకగొప్పయాపద సంభవించెను. ఆయాపదవలననే సత్యవతియొక్క ధైర్యస్థైర్యములు బాగుగా బయలుపడి యామె కీర్తి శాశ్వతపఱిచెను.