పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/161

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లీలావతి.

ఉ. వింతగ వాదమేల యవి వేకుల పోలిక? స్త్రీలవిద్య సిద్ధాంతమె చేసినారు మనతజ్ఞులు పూర్వులు. - వీరేశలింగకవి.

గణితశాస్త్రపండితుఁడని ప్రసిద్ధిఁగాంచిన భాస్క రాచార్యుల కొక కూఁతురుండెను. ఆమెపేరు లీలావతి. సిద్ధాంత శిరోమణియందు భాస్క రాచార్యులవారు తా నాగ్రంథము 1072 వ శాలివాహన శకసంవత్సరమునందు రచియించితినని వ్రాసినందున లీలావతి 12 వ శతాబ్దముననుండినట్టు తేలుచున్నది. లీలావతి బాలవితంతువైనందున నామె భర్తృవంశమేదియో తెలియదు. మనదేశమునందుఁ జరిత్రములు వ్రాసి యుంచుపద్ధతి పూర్వమునుండి లేనందున గణితశాస్త్రమునం దసమానపండితయైన లీలావతినిగుఱించి కొన్ని సంభవాసంభవములగు కధలుదప్ప మఱియేమియుఁ దెలియదు. ఐననుదంతకధలుదప్ప చరిత్రమున కితరసాధనంబు లేవియు లేనందున నాదంతకథలే యిచ్చట వ్రాసెదను. భాస్క రాచార్యులవారు జ్యోతిషమునందు మిగుల ప్రవీణులు. కాన లీలావతికి వైధవ్యము ప్రాప్తించునని జాతకమువలనఁ దెలిసికొనెనఁట. అందువలన భాస్క రాచార్యులు పూర్ణాయువు గలవరును వెదకి తెచ్చియొక మంచిముహూర్తమునందు లీలావతికి వివాహము చేయ నిశ్చయించిరి. వివాహమునకుఁ బూర్వము చేయవలసిన విధుల జరిపి కన్యావరులను మండపమునందుఁ గూర్చుండఁబెట్టెను.