పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

అబలాసచ్చరిత్ర రత్నమాల.

మారుఁ డగుటకై రారాజుకుం దగినడంబముతోఁ గూడితూపనగరమునకుఁ బయలుదేరెను. ఔరంగజేబు రాకడ విని విమలదేవి డెందమునన్మిగులఁ గుంది చచ్చుటకు నుంకించునంతలో రాజసింహుఁడు వచ్చి యామెను చేపట్టిమరలఁ తనసీమకుఁదీసికొని పోవఁ దొడఁగె. ఇట్లు పోవుచు నొకప్పుడు గొన్ని కొండల నడుమకు వచ్చిరి. అప్పు డచట వారు కొంతసేపు డప్పి దీర్చికొనుటకై కూర్చుండిరి. అచ్చటికిఁ గొంచెముదవ్వుననేయౌరంగజేబు తనమూఁకలతో విడిసియుండెను. అప్పు డౌరంగజేబు నాతియు విమలదేవియక్కయు నగు కేసరిబాను ఒక చెంచువాఁ డెట్టులనో పట్టుకొనితెచ్చి వీరు దిగిన కొండత్రావునందొక పొదచాటుననుంచెను. అప్పు డామె "నన్నెవరయినఁ గాపాడుఁడ"ని యాకారడివిలో మొఱ్ఱపెట్టఁగా విని విమల తనమగని నంపఁ గానారాచపట్టి యా చెంచువానిచేతినుండి కేసరిబాను విడిపించి తనయింటియొద్దికిఁ దీసికొనివచ్చెను. కేసరిబా చెల్లెలి మొగముచూడ సిగ్గుపడి యామె తనకుఁ జేసినసాయమునకుఁ గరంబు సంతసించి తాను విమలకుఁ జేసిన యెగ్గునకుఁ దన్ను మన్నింపుమని చెలియలిని వేఁడుకొనెను. అప్పుడు విమలదేవి తనయక్కను వెఱవవలదని చెప్పి కొందఱుబంటుల వెంట నిచ్చి యామెను నౌరంగ జేబువద్ది కంపెను. కేసరిబా సెప్పఁగా నౌరంగజేబు జరిగినకత యంతయు విని రాజసింహునిపైఁ గల పగమాని డిల్లీకిఁబోయెను. రాజసింహుఁడును నెలఁతతో ఉదేపురమున కరిగి సుఖంబుండె.