పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహారాణీఝాశీ లక్ష్మీబాయి

137

ఆమె గఱపిన యాలోచన పేష్వాగా రంగీకరించి దిన ప్రయాణములు చేసి 1858 వ సంవత్సరము మేనెల 30 వ తేదిని గ్వాలేరునకు సమీపమునం దున్న మురారిపుర సమీపమునఁ బ్రవేశించిరి. అంత వారందఱును విచారించి సిందేగారిని తమకు సహాయు లగుటకుగాను వర్తమాన మంపిరి.

ఆవార్త సిందేగారి దరబారున కరగఁగా నదివఱకుఁ దాత్యాటోపేబోధవలన నాతనికి వశులైన సరదార్లందఱును పేష్వాగారికి సహాయము చేయుదమని చెప్పిరి; కానిప్రభుభక్తిగల జయాజీరావు సిందేగారును, దివాను దినకరరావుగారును వారివాక్యములను లెక్కింపక మిగుల యుక్తిగా మఱుసటిదినము పేష్వాసైన్యములను బాఱుఁదోల నిశ్చయించిరి. కాని ఆ రాత్రి దివానుగారు లేని సమయమున నెవరో మహారాజుగారిని యుద్ధమునకుఁ బురికొల్పిరి. అంత నాయన తన కధిక విశ్వాసపాత్రములగు సైన్యములంగొని సూర్యోదయమువఱకు మురారి కీవల రెండుమైళ్లదూరమునఁ గల బహాదురపురమునందుఁ దనదండను నిలిపి యుద్ధ మారంభించెను. ప్రధమము నందు పేష్వాసైన్యములపైఁ బడుగుండ్లను గని సిందే పూర్వము పేష్వాల బంటగుటవలనఁ దమ కనుకూలుఁడై తమనెదుర్కొన వచ్చుచున్నాఁడని తలఁచిరి కాని యాబాణవృష్టి యంతకంత కెక్కువగుటవలన పేష్వా మొదలగు పురుషశ్రేష్ఠులందఱు రిచ్చవడి యేమియుఁ దోఁచకుండిరికాని వారు తాను చెప్పినటుల సైన్యపు బందోబస్తు చేయకున్నను, కోపముంచక రాణీ లక్ష్మీబాయిగారు తగినయుక్తిఁగఱపి యుద్ధమారంభముచేసెను. అందువలన నారెండుసైన్యములును కొంతవఱకు సమానము