పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

అబలాసచ్చరిత్ర రత్నమాల.

లక్ష్మీబాయిగారి తెలివిని గని తాతాటోపిని లక్ష్మీబాయిని సర్వసైన్యాధిపత్యమునకు నియమించెను. అందుపై వారిరువురు మిగుల దక్షతతో సైనికులకు యుద్ధము గఱపుచుండిరి. ఇంతలో నాంగ్లేయసైన్యంబులు కాల్పీనగరము నలుప్రక్కల ముట్టడించెను. అప్పుడు రెండువందలగుఱ్ఱపుబలము నిచ్చి యమునానదివైపున యుద్ధముచేయ రాణిగారి నంపిరి. ఆమెయుఁ గడమసైన్యము మిగులజాగ్రతగా నుండుటఁ గని తనస్థలమునకుఁ బోయెను. కాని యుద్ధమునం దసమానప్రజ్ఞగల హూణసైన్యంబు లల్పకాలములోనే పేష్వాగారి సైన్యంబుల దైన్యంబు నొందించెను. అది గని రావు సాహేబు పేష్వా మొదలగు వా రధికవిచారమున మునుంగ రాణిగారు వారికి ధైర్యపు మాటలు చెప్పి తనస్వల్పసైన్యముతో శత్రువులను చీకాకు పఱచెను. కాని వెనుకనుండి వచ్చుశత్రు సైన్యములవలనను, తమసైన్యమునందలి యితరసేనాధిపతులు పలాయితు లగుట వలనను రాణిగారు యుద్ధమునుండి తొలఁగవలసినవా రయిరి.

ఇట్లు కాల్పీయం దపజయమును బొందిన యీప్రముఖులందఱును గ్వాలేరువైపునఁ గలగోపాలపురమునందుఁ జేరి ముందు చేయవలసినదానినిగూర్చి విచారింపుచుండిరి. వారెంత విచారించినను సైన్య మత్యల్ప మగుటచే యుద్ధము చేయుటకుఁ దోఁచకుండెను. రాణిగారును వారితోడనే యుండెఁగాన నామె యాయల్పసైన్యముతో గ్వాలేరున కరిగి సిందేగారిని తమకుఁ దోడుపడ వేఁడుకొనవలయు ననియును, అందు కాయన సమ్మతించినయెడల యుద్ధము చేయవలయుననియు నాలోచన చెప్పెను.