పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/146

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
132
అబలాసచ్చరిత్ర రత్నమాల.

ఇట్లు 31 వ తేదివఱకును యుద్ధము జరిగినను ఆంగ్లేయ బలంబులు రాణిగారికోటను భేధింపఁ జాలవయ్యె. ఈరణరంగమునందు వారియుద్ధసామగ్రి యంతకంతకుఁ దక్కు వగుట వలన వారు జయమునం దంతగా నమ్మకములేక యుండిరి. ఇంతలో నానాసాహేబు[1]పేష్వాయొక్క సేనానాయకుఁడగు తాతాటోపేయను వీరుఁడు లెక్క కెక్కువయగు సైన్యముతో రాణిగారికిఁ దోడుపడుటకై కాల్టీనుండి వచ్చుచుండెను. ఆసైన్యము బహుదూరమున నుండఁగానే యాంగ్లేయ సేనా నాయకులు దూరదర్శకయంత్రమువలనఁ గనిరి. అంత నగ్ని దేవునకు వాయుదేవుడు సహాయ మగునటుల నీరాణిగారికి నాసైన్యమువచ్చి తోడుపడిన మనజయ మసత్య మనుకొనిరి. సర్ హ్యూరోజ్ దొర యంతమాత్రమున జంకక యచట రాణిగారితోఁ బెనఁగఁ గొంతసైన్యమును నియమించి కోటలోనివా రెఱుఁగకుండఁ గొంతసైన్యమును కాల్టీమార్గమున కంపెను. వారు చని యాత్రోవ వచ్చుచున్న విపులసైన్యములతోఁ బెనఁగి తమయుద్ధ సామర్థ్యమువలన వానినిఁబాఱఁదోలిరి. తాతాటోపేసైన్యముల బారికోర్వఁజాలక తమ యుద్ధసాహిత్యము నచటనే విడిచి పలాయితము లయ్యెను. కాన నాసాహిత్య మనాయాసముగా దొరకినందున సర్ హ్యూరోజ్ గారి బలంబులు మిగుల నుత్సాహము గలవయ్యె.

  1. నానాసాహేబు (రెండవ) బాజీరావు దత్తపుత్రుఁడు. 1857 వ సంవత్సరపు సిపాయిల స్వామిద్రోహమునకు నితఁడే పురస్కర్త. ఇంగ్లీషు వారియొద్దనుండి తన పూనారాజ్యము మరల సంపాదించవలయునని యితని యత్న ముండెను.