పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/136

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
122
అబలాసచ్చరిత్ర రత్నమాల.

దెను. గంగాధరరావు మహారాజుగారి మనస్సునందు పుత్రశోక మధికమయినందున ఆయన నానాటికి క్షీణించి, వైద్యోపచారములవల్ల నడుమనడుమ కొంచెము స్వస్థపడుచుండెను. ఇట్లు కొన్నిదినములు గడచినపిదప 1853 వ సంవత్సరము అక్టోబరునెల నుండియు నాతనిశరీరము మఱింత క్షీణింపసాగెను. అనేక రాజవైద్యులు సదా సమీపమునందుండి యౌషధోపచారములు చేయుచుండిరి. కాని యెంతమాత్రమును సుగుణమగుపడు జాడ గానరాకపోయెను. నవంబరు 15 వ తేది నుండి గంగాధరరావు ప్రకృతియందు వికార చేష్ట లనేకములు కానిపించుచువచ్చెను. అందువలన సంస్థానపుమంత్రి యగు నరసింహారావును మోరోపంతు తాంబేగారును గలిసి ముందు సంస్థానవ్యవస్థనుగూర్చి మహారాజులంగారితో ముచ్చటించిరి. వారి ప్రసంగమును వినినపిదపఁ దన కిప్పుడే రోగ మసాధ్యముగా లేదనియు, ముం దసాధ్యమగు నేని తమవంశమునందలి ఆనందరావును తనకుఁ దత్తపుత్రునిగాఁ జేసి యనంతర మా చిన్నవాఁడు స్వరాజ్యభారశకుఁ డగువఱకును వానిపేరిట లక్ష్మీబాయియే రాజ్యముఁ బాలింపవలయుననియుఁ జెప్పెను. అందుపై వారంద ఱాక్షణముననే ముహూర్తనిశ్చయము చేసి త్వరలోనే శాస్త్రోక్తముగా దత్తవిధి నడిపిరి. ఆమహోత్సవమునకు ఝాశీయందలి యనేకప్రముఖులను బిలిచిరి. వారితోడనే బుందేలఖండె పొలిటికల్ అసిస్టెంటు యేజంటగు మేజర్ యేలీసు దొరగారినిని, సేనాధిపతియగు క్యాప్టన్ మార్టిన్ దొరగారిని బిలిచిరి. వీరందఱి సముఖముననే దత్తవిధానము జరిగి ఆనందరావు పేరు దామోదరరావని పెట్టిరి.