పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహారాణీఝాశీ లక్ష్మీబాయి

121

గొందఱాప్తులతో మోరోపంతుగారు ఝాఁశీకి వెళ్ళిరి. అచటనే 1842 వ సంవత్సరమున మనూబాయి వివాహము మిగుల వైభవముతో జరిగెను. వివాహానంతరమునందు దేశాచారప్రకారము అత్తవా రాచిన్నదానికి 'లక్ష్మీబాయి' యను పేరుపెట్టిరి. మామగా రగు మోరోపంతు తాంబేగారికి 300 రూపాయల వేతన మిచ్చి గంగాధరరావుగారు తమయాస్థానమునందొక సరదారుగా నుంచినందున లక్ష్మీబాయి మరల బ్రహ్మావర్తమున కరుగుట తటస్థించినది కాదు.

గంగాధరరావుగారి యన్న గారగు రఘునాథరావుగారి పరిపాలనలో రాజ్యము విశేష దుస్థ్సితికి వచ్చినందున నారాజ్యాధికారమును పూర్ణముగా దొరతనమువారే స్వాధీనపఱచుకొని రాజ్యమునకుఁ గల ఋణములను దీర్చుచుండిరి. లక్ష్మీబాయి వివాహానంతరము గంగాధరరావుగారి యోగ్యతను గని బుందేలుఖండుయొక్క పొలిటికల్ యేజంటగు కర్నల్ ప్లీమన్ దొరగారు సర్వ రాజ్యపాలనమును గంగాధరరావు గారి స్వాధీనము చేయించిరి.

గంగాధరరావు తనప్రజలను సుఖులనుగాఁ జేయనెంచి రాజ్యమును బహునిపుణముగాఁ బాలింపుచుండెను. ఈయన కాలమునందు ఋణము లన్నియుఁ దీఱి భాండాగారమున ధనము దినదినాభివృద్ధిఁ బొందుచుండెను. ప్రజలును మిగుల సుఖులై యుండి సదా రాజును, రాణిని దీవింపుచుండిరి.

ఇట్లు కొన్ని రోజులు సౌఖ్యములోఁ గడచిన పిదప లక్ష్మీబాయిగారి దు:ఖమునకుఁ బ్రారంభ మయ్యెను. ఆమె కొకపుత్రుఁడు గలిగి మూడుమాసములు జీవించి మృతిఁ జెం