పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/126

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
112
అబలాసచ్చరిత్ర రత్నమాల.

యింతటిదృఢనిశ్చయమును, ధైర్యమును, ఈశ్వరునియందునమ్మికయుఁ గలిగి వర్తించుటమిగుల స్తుత్యముగదా!

ఇట్లు ధూమనౌకపైఁ బ్రయాణముచేయుచు ననేక ద్వీపములనుగడచి జూన్ 18 వ తేదిని ఆనందీబాయి అమేరికా చేరెను. అచటికి ఆనందీబాయి వచ్చుచున్న వార్తవిని యదివఱకే కార్పెంటరు దొరసాని యోడవద్దకివచ్చి ఆనందీబాయి నెదుర్కొనెను. అప్పు డాయిరువురికిని గలిగిన యానంద మింతంతయని చెప్పుటకు వీలులేదు. కార్పెంటరు దొరసాని ఆనందీబాయి సద్గుణములను నేటికిని మఱవలేదు. ఇట్టిస్త్రీలుబహుసంఖ్యలో నొకరుందురని యామె యనుచుండెను.

ఆనందీబాయి అమేరికాలోని న్యూజరసీపట్టణమున కేఁగ నచట కార్పెంటరు దొరసానిగారి కుటుంబీకులందఱును ఆమెను బహుమర్యాదచేసిరి. వీరింటనుండియే ఆనందీబాయి తనచదువున కనుకూలమగు తావువెతకుకొనెను. అచటనున్న నాలుగు నెలలు వృధపుచ్చక ఆనందీబాయి కుట్టుపని, అల్లికపని జలతారుపని నేర్చుకొనెను. తదనంతర మామె ఫిలడెల్పియా యనుమహాపట్టణమున వైద్యవిద్య నభ్యసించునటుల స్థిర మయ్యెను.

కొందఱు పురుషులుగాని, స్త్రీలుగాని తమదేశమును వదలి పరదేశమున కరిగినపిదపఁ దమదేశాచారముల విడిచి విదేశాచారములనే స్వీకరింతురు. కాని మాచరిత్రనాయిక యట్లుకాక పాతాళలోకమున కరిగియుఁ దనదేశాచారముల మఱవక యాదేశపువారికిని వానిని నేర్పెను. ఆమె తనస్నేహితు