పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/125

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
111
డాక్టరు ఆనందీబాయి జోశి

నువారు తమసుఖములను విడిచి, స్వదేశహితమునకై కష్టముల ననుభవించిరి. వారి స్వదేశభక్తినెంతపొగడినను తీరదు. త్రోవలో సహవాసముగానుండిన క్రైస్తవస్త్రీలామెను తమమతమునకుఁ ద్రిప్పవలయునని విశేషముగా బోధించిరి. కాని దృఢనిశ్చయురాలయిన యాయబల వారికిఁ దగినయుత్తరముల నిచ్చి యామతమును ఖండించెను. అందువలన నాయువతు లామెను మిగులతిరస్కారముగాఁ జూచియు, ఆమెకు శరీరమస్వస్థముగానుండినను విచారింపక ఉపోషము చేసినను భోజనముచేయు మనక ఆమె తినదని యెఱిఁగియు మాంసాహారములు తినెదవాయనియామెను కేరడములాడియు విశేషబాధపెట్టిరి. ఆనందీబాయి వారింత చేసినను వారిపై కోపపడక స్వదేశవియోగము, స్వజన వియోగము వలనఁ గలిగిన దు:ఖమును తానే యాపుచు దొరకినచో ధాన్యాహారము చేసియు, దొరకనిచో నుపోషముండియుఁ గాలముగడుపుచు స్టీమరుపై వెళ్ళుచుండెను. ఆహా! ఇట్టిస్వదేశాభిమానమును, స్వధర్మాభిమానమును గలస్త్రీ సర్వజనవంద్యయనుటకు సందేహముగలదా? కొందఱు క్రైస్తవమతబోధకులు మొదట తాము మిగుల ప్రేమకలవారుగా నగుపడి, తమమతము నితరులకు బోధింతురు. వారు తమబోధవలనఁ దమమతము నవలంబింపరని వారికిఁ దెలియఁగా ననేకరీతుల వారి నవమానింతురు. ధర్మగురువు లగువారి కిది యెంతమాత్రమును తగినపని కాదు. తోడివారలు తన నట్లుచూచి సహాయ మేమియుఁ జేయకుండినను ఆనందీబాయి తనకుఁ బరమేశ్వరుఁడే సహాయుఁడని నమ్మియుండెను. పదినెనిమిది సంవత్సరముల వయసునందే