పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/115

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
101
డాక్టరు ఆనందీబాయి జోశి

దు నొక సర్వకళాశాలయు నన్ని రాజధానులలోను మంత్రసాని తనము నేర్పు తరగతులును నుండుట సత్యమే. అయిన నందలి బోధకులు ప్రాచీనాచారప్రవిష్టు లగుటచేతను, కొంతవఱ కసహిష్ణు లగుటవలనను అచ్చట నొసఁగఁబడుచున్న విద్య యసంపూర్ణ మయినదిగాను లోపములతోఁ గూడినదిగాను నున్నది. ఇట్లనుట నే నాబోధకుల తప్పుల నెంచుటకుఁ గాదు సుఁడీ అది పురుషుల స్వభావమని మనవిచేసితిని. వీరికి మాఱుగా నాస్థానములను స్త్రీలలంకరించువఱ కిట్టి యిబ్బందులకు మన మోర్చుకొనవలసి యున్నది.

నేను క్రైస్తవురాలను గాను; బ్రాహ్మమతావలంబినిని గాను. కాఁబట్టి హిందూమతాభిమానము గలిగి తద్ధర్మముల ననుష్ఠింపుచు నీదేశమున నెందయినను పాఠశాలకుఁ బోయి విద్య గఱచుట నాఁబోటి బోఁటికి దుష్కరము. ఇంగ్లీషువారి యుడుపులఁ దొడిగికొని నడయాడుమతాంతరు లయినను ఇచటిప్రజలు నన్నుఁ జూచిన ట్టూరకయగఁదిగఁ జూడరు. నగరులలోను, వెలుపలను, నావంటి హిందూయువతులకుఁ గలుగుచున్న దురాక్షేపణలు, దుర్వదంతులు స్వదేశీయులైన క్రైస్తవస్త్రీలకు లేశమును గలుగుటలేదు. పొగబండిలోఁగాని, నీధుల వెంటగాని నేనొంటరిగాఁ బోవునపుడెల్లప్రజలు కొందఱు నన్నుఁ జేరి నామొగమువంక నట్టే చూచుచు కొంటెప్రశ్నలచే నన్నలయింపుచుందురు. ఈపొడిమాటలకంటె కొన్ని యుదాహరణములవలన నిజము మీమనసులకు నాటఁ జెప్పెదను చిత్తగింపుఁడు.