పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

అబలాసచ్చరిత్ర రత్నమాల.

తెచ్చుచుండిరి. ఇట్లుండఁగా 1880 వ సంవత్సరమునచటినుండి భూజయను గ్రామమునకు మార్చినందున నాదంపతు లచటి కరిగిరి. బొంబాయినుండి భూజకుఁ బోవునపుడు ఆనందీబాయి ముత్తవ యామెతోడ రానందున నింటిపని యంతయు నామెయే చేయవలసియుండెను. ఇంటిపనినంతను చేసి యానందీబాయి భర్తకడ నింగ్లీషు సహితము నేర్చుకొనెను. అచటనే యామె యింగ్లీషు మాటాడుట చక్కఁగా నేర్చుకొనెను.

గోపాలరావుగారికి భార్యను విశేష విద్యావతినిఁ జేయవలెనని యుండుట నొకవార్తాపత్రికలోనఁజదివి అమేరికాలోని న్యూయార్కుపట్టణవాసినియగు మిసెస్ బి. ఎఫ్. కార్పెంటర్ అను నామె ఆనందీబాయికి సహాయముచేయఁదలఁచి యామె కొకయుత్తరమువ్రాసెను. ఈమెయే ఆనందీబాయి కనేకవిధములసహాయముచేసి యామెను కూఁతురివలెఁ జూచుచుండెను. కాన ఆనందీబాయియు నీమెయందధికప్రేమ గలదియయి యీమెను పిన్ని యని పిలుచుచుండెను. ఈమెకు ఆనందీబాయి వ్రాసినయుత్తరములవలన మనదేశమునందలి స్త్రీలకుఁ గల పరతంత్రయు, దానిని వదలించుటకై ఆనందీబాయికిఁ గలయభిప్రాయమును దెలియుచున్నవి. స్త్రీలకు విశేష విద్యగఱపినం గాని స్వహితము తెలియదని యామెమతము. ఇదియంతయు నామె స్వానుభావము వలననే తెలిసికొనెను. ఇట్లుత్తరప్రత్యుత్తరములవలన నాయిరువురకును సఖ్య మధికమయ్యెను.

తదనంతరము గోపాలరావుగారిని కలకత్తాకు మార్చిరి. అచ్చటనుండు కాలములో పోస్టుఆఫీసులో 30 రూపాయలవేతనముగల యుద్యోగము ఆనందీబాయికొఱకు సిద్ధమయ్యెను.