పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/107

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
93
డాక్టరు ఆనందీబాయి జోశి

వివాహమున కొప్పుకొనెద" ననెను. గణపతిరావుగా రందున కొడంబడఁగా గొన్ని దినములకు వివాహముజరిగెను. దేశాచారప్రకారము వివాహానంతరము యమునాబాయికి 'ఆనందీబాయి' యని యత్తవారు పేరుబెట్టిరి. పెండ్లియైనపిదప గణపతిరావుగారి యనుమతిప్రకారము, గోపాలరావు నిత్యము సాయంతనము కళ్యాణపట్టణమునకు వచ్చుచుండెను. ఆనందీబాయి కొంచెము చదువుకున్నదని తెలిసి గోపాలరావు మరాఠి పుస్తకములను కొన్ని తెచ్చి ముత్తవచేత నామెకిప్పించి చదువునట్టు చేయుచుండెను. రెండవ పెండ్లివాఁ డగుటచే పిల్లదానినిత్వరలో భర్తగారితో మాటలాడఁ బురికొల్పసాగిరి. కాని ఆనందీబాయి కాకాలము భర్తయనిన నొకవ్యాఘ్రమువలెఁ దోఁచుటచే నామెమిగుల భయపడుచుండెను. గోపాలరావామెనెంతమాత్రమును భయపెట్టక బుజ్జగించియే చదువు మొదలయినవి చెప్పుచుండెను.

గోపాలరావు ఆనందబాయికి విద్యనేర్పుట ఆయనమామగారి కెంతమాత్రమును సమాధానములేదు. ఆయనతానందు కొడం బడినవాఁ డగుటవలన నల్లునితో నేమియు ననజాలక యితరులచే స్త్రీవిద్యవలనం గలుగు నష్టములు చెప్పించి మాన్ప జూచెను, కాని గోపాలరావు వారికిఁ దగిన బ్రత్యుత్తరము చెప్పిపంపెను. మామగారియూరికి సమీపమునం దుండిన యెడల భార్యవిద్య సాగదని గోపాలరావు అల్లీబాగనుగ్రామమునకు మార్చుకొనెను. అచటికి ఆనందీబాయితోడ నామెముత్తవ పోయియుండెను. కాన పిల్ల కేవిధమయినభయము లేకయుండెను.