పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గొందరు మహానుభావులు వక్కాణించెదరు. ఈయారోపణములన్నియు నిరర్థకములనియు, స్త్రీవిద్య దురాచార ప్రతీకారానుకూల మగునేకాని దురాచారప్రవృత్త్యనుకూలము గానేరదనియు, స్త్రీవిద్యాస్వాతంత్ర్యముల వలన మన దేశమునకు లాభమే, గాని నష్టము గలుగ నేరదనియు, స్త్రీవిద్య యత్యంతావశ్యకం,బనియు, సోదాహరణ పూర్వకముగా నిరూపించుట నాద్వితీయోద్దేశము.

(3) ఆంథ్రదేశములోని భగినీగణములకు మనోరంజకముగను, ఉపదేశకరముగను ఉండుపుస్తకము నొక దానిని రచించుట నాతృతీయోద్దేశము. యుపదేశ గ్రంథములవలనను, కేవల కల్పనాకథలవలనను జేసినయుపదేశమున కంటె నిజమైన చరిత్రంబుల వలన జేసిన యుపదేశము అధిక ఫలప్రదంబగునని యందరికి దెలిసిన విషయమే. కాన, నిజములైన యీ స్త్రీల చరిత్రముల వలన నాంధ్రసోదరీమణులకు బాతివ్రత్యము, స్వదేశాభిమానము, స్త్రీవిద్య మొదలయినవాని గురించి కొంత విన్నవించు కొనవలయు నని నామూలోద్దేశము.

నేను వ్రాసెడి యీచరిత్రములలో ననేకములు మహారాష్ట్ర భాషనుండియు, హిందీభాషనుండియు నాంధ్రీకరింప బడును. కనుక, నీ చరిత్రములయందలి యుత్తమ భాగములకయి యాయా భాషలలోని గ్రంథకర్తలను మెచ్చవలయునేగాని నన్ను శ్లాఘింప వలసినపని యెంతమాత్రమును లేదు.