పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గలుగుచుండెను. ఆసమయమునందు క్లారీసాబదేవరును ఫ్రెంచు స్త్రీచే రచింపబడిన గ్రంథమొకటి ఈమె చదువుట తటస్థించెను. దాని నింగ్లీషున భాషాంతరీకరింప వలయునని యామెకు దృడతరమైన యిచ్ఛకలిగెను. అంత నామె భాషాంతరీకరణమునకు ననుజ్ఞ యిమ్మని పుస్తకకర్త్రికి నుత్తరము వ్రాసెను. అందుకు నా గ్రంథకర్త్రి యనుజ్ఞనిచ్చెను. అప్పటి నుండి వారికి నత్యంతస్నేహము కలిగినందున, తోరూ ఆగ్రంథకర్త్రికి గృతజ్ఞతాపూర్వకముగా దనపటమును, సంస్కృతము నుండి తాను ఫ్రెంచులోనికి భాషాంతరీకరించిన సరసపద్యములను బంపెను. ఆ పద్యముల నా దొరసాని యెంతయో మెచ్చెనట! గాని, యీ దేశముయొక్కయు, విశేషముగా నీ దేశములోని స్త్రీలయొక్కయు దౌర్భాగ్యవశమున విద్యావతియగు తోరుదత్తు ఫ్రెంచు గ్రంథకర్త్రియొక్క గ్రంథమును భాషాంతరీకరింపకయే 1877 వ సంవత్సరమున నశ్వరమగు ప్రపంచమును వదలి శాశ్వతమగు పరలోకమున కరిగెను. ఈమె యంత్యసమయమునందు జెప్పిన వాక్యముల వలన నామె శుద్ధాంత:కరణము వ్యక్తమగుచున్నది. ఆ సమయస్థితి నా యమ తండ్రిగారిట్లు వ్రాసిరి. ఆమె తన యంత్యదినములు సమీపింపగా తనకు మందిచ్చు డాక్టరుతో నిట్లనియె. 'శారీరక బాధను నేను సహింపజాలకున్నాను, కాని నాయాత్మకు నాయాస మెంతమాత్రమును లేదు. పరమేశ్వరుని యందు నాకు దృడమైన నమ్మకముగలదు.' ఈవాక్యముల వలన నీమెకుగల యనుపమేయ దైవభక్తి తెలియుచున్నది.