పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆపుస్తకము జదివి యతడు ఇంగ్లీషుదేశమునందలి "ఎక్జామినర్" అను వార్తాపత్రికయందు దాని నిట్లు ప్రశంసించెను. "ప్రొ. మింటో దొరగారు 'ఎక్జామినర్‌' అను వర్తాపత్రికాధిపతిగా నున్న సమయమునం దొకదినము నేను వారి కార్యస్థానమునకు బోవుట సంభవించెను. అపుడాయన తనయెద్దకు నభిప్రాయమునకై వచ్చిన పైని హిందూస్థానముద్రగల, యొకపుస్తకము నా చేతికిచ్చెను. ఆ పుస్తకము చూచుట కసహ్యముగా నగుపడుచుండెను. అది భవానిపురమునందలి సప్తాహిక సంవాదమను ముద్రాక్షరశాలయందు ముద్రింపబడినది. ఇది రెండు వందల పుటములుగల పుస్తకము. దీనియందు నుపోద్ఘాతము మొదలైనవెంతమాత్రమును లేవు. దాని జూచినతోడనే చిత్తుకాగితముల బుట్టలో బారవేయవలయునని తోచును. అందలి సగము అంటీయంటని యక్షరముల గనిన, దానిలో నుత్తమకవిత్వము కలదని తోచకుండుట యొకవింతకాదు. కాని, పుస్తకము విచ్చి దానియందలి పద్యమొకటి చదివిన తోడనే నాకు గలిగిన యానందాశ్చర్యములు వర్ణింపశక్యముకాదు." తోరూదత్తు రచించినగ్రంథము లన్నిటిలో నిది ప్రథమ ప్రయత్నమేయైనందున ఈ కావ్యము తదనంతర మామెచే రచియింపబడిన కావ్యములంత రసవంతమైనవి గాక యుండుట సహజము. అయిన నట్టిగ్రంథమే పాశ్చాత్యపండితులచే గినియాడబడినప్పుడు ఆమెచే రచియింపబడిన యితర కావ్యము లెంతరసవంతములై యుండునో చదువరులేయూహించుకొనగలరు.