పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గతించినపిదపను ధైర్యము విడువక తన ప్రయత్నమును మానకుండెను. ఈమె రచించిన 'పద్యసముదాయమ' ను ప్రథమ గ్రంథము 1876 లో వెలువడెను. దానియందు ఫ్రెంచు కవీశ్వరుల కావ్యములనుండి, ఇంగ్లీషుభాషకు భాషాంతరీకరింప బడిన పద్యరూపముననున్న చిన్న చిన్న కధలుండెను.

అందు పీఠిక స్థానమున నొక పద్యము వ్రాసి ఈ గ్రంథము తనతల్లికి గృతియిచ్చినటుల జెప్పెను. ఇందుచే నీమె మాతృ భక్తి వెల్లడియగుచున్నది. ఈ గ్రంథము మొట్టమొదట బంగాళాదేశమునందలి భవానీపురమునందు నచ్చువేయబడెను. కాగితములు బహు సన్ననివిగాను, అచ్చు అంటి యంటనటులు గాను, ఈ పుస్తకము గుజనీ పుస్తకముగా నచ్చువేయబడెను. లోకములో బైసౌందర్యము జూచి భ్రమించు వాడుక గలదు. కాన, నది మంచి గ్రంథమేయైనను దాని బహిరంగము చూచుట కింపుగా లేనందున నందలి పద్యరత్నములను చదువుట కాకాలమునం దెవరికిని బుద్ధిపుట్టదయ్యెను. అందువలననే ఈ కవయిత్రి పుస్తకము మనదేశమునందాకాలమున మెప్పువడయ కుండెను. ఇట్లు బయిటిదంభమునకే భ్రమపడు వారనేకులుండినను, ఈ జగత్తునందు సత్యశోధకులును, సద్గుణపరీక్షకులును నూటికి కోటికినైన నొక్కరు గానపడక పోరు. ఇట్టి రసికులుండుట వలననే కవిత్వాదివిద్యలువృద్ధిబొందుచున్నవి. తోరూ భాగ్యమువలన నిట్టి రసికిడొకడు, ఇంగ్లీషుదేశమునందుండెను. దైవ వశాత్తుగ నీ పుస్తక మాయన చేతబడుట సంభవించెను. ఈ గుణగ్రహణ పారీణుని పేరు ప్రొఫెసర్ ఎడ్మండ్‌గ్యాస్.