పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దక్షతతో, న్యాయముతో, రాజ్యపరిపాలనము జేయుచు బ్రజలను సంతోష పెట్టుచుండెను!

ఇట్లు తనప్రజలను సుఖపెట్టుచు, పర రాజులతో వైరము లేక ఐదారుసంవత్సరములు రాణీగారు రాజ్యము చేసినతరువాత, మొగలాయి రాజైన యక్బరు బాదుషా ఆమె కీర్తివిని, యిట్టి రాజ్యము పరిపాలించెడి రాణి మనకు సంకితురాలుగా నుండవలయునని నిశ్చయించెను. ఇట్లుతలచి యక్బరు ఆసఫ్‌ఖాన్ అను ప్రసిద్ధవీరుని 1564 వ సంవత్సరమున దుర్గావతి రాజ్యముపైకి బంపెను! అక్బరు సకల సద్గుణసంపన్నుడని చరిత్రకారులు చెప్పెదరు. అతనియందు ననేక సద్గుణములుండెడివి. ఇతర యవనప్రభువులతో బోల్చిచూచినయెడల నతడు దేవసమానుడే యని చెప్పుటకు సందేహములేదు. కాని, యిట్టి మహాత్మునిగూడ రాజ్యకాంక్ష వదలినదికాదు. రాణి దుర్గావతి యక్బరునేమి, ఆయన రాజ్యములోని ప్రజలనేమి యెంతమాత్రము బాధపెట్టినది కాదు. వారి జోలికైన నెన్నడు పోయినదికాదు. ఇట్టులుండగా నా యబలమీదికి సైన్యమంపుట మహత్వా కాంక్షగాక మరియేమి? ఇట్లు ఆసఫ్‌ఖాను శూరుడు (అవును, అబలతో యుద్ధమునకు దలపెట్టినవాడు శూరుడే.) తనపై దండెత్తి వచ్చు చున్నాడన్నమాట విని, దుర్గావతి భయపడక, మహా థైర్యముతో యుద్ధమునకు సిద్ధము చేయసాగెను. మహా ప్రయత్నముచేసి కొద్దికాలములోనే 500 కరులను 5000 తురంగములను, గొప్ప కాల్బలములను సిద్ధపరచెను. తాను పురుషవేషము ధరించి, ఆయుధములను బుచ్చుకొని, ఏనుగుపై నెక్కి