పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నుండెను. ఈరాజు పాలించెడి గడామండల రాజ్యమంతగా గొప్పది కాకపోయినను, అతడు మిక్కిలి బలవంతుడై, అతనికి అనేక రాజులు సహాయముగా నుండిరి. ఇట్టి రాజుతో బోరి గెలుచుట దుర్లభమనియు, దుర్గావతి మనము అతనియందు జిక్కినదనియు నెఱిగి, చందేల్ రాజు గడామండలేశ్వరునకు దన కన్యకనిచ్చి మహావైభవముతో వివాహము చేసెను.

వివాహము జరిగినతరువాత నత్తవారింటికి వచ్చునప్పుడు దుర్గావతి, తండ్రి రాజ్యమునందున్న బీదసాదల కనేకులకు శాశ్వత జీవనము లేర్పరచెను. అందువలన వారందరామెను తమపాలిటి దైవమని భావించి యామె కనేకములైన దీవన లొసంగిరి. ఈమె గడామండలమునకు వచ్చినతరువాత నీమె భర్త, రాజ్యవిచారణమేమియు చేయక, యీమెయందే యధికాను రాగము కలవాడై, సదా నర్మదానదీతీరమునను, అచ్చటనున్న యుద్యానవనములయందును విహరించుచు కాలము వ్యర్ధపుచ్చుచుండెను. అనేక పర్యాయములు దుర్గావతి రాజ్యమును బాగుగా నేలుడని రాజునకు సూచించెను గాని, విషయాసక్తుడయిన రాజు ఆ మాటలను లక్ష్యపెట్టినవాడు కాడు. అంత గొంత కాలమునకు దుర్గావతీరాణి గర్భవతియయి యొక పుత్రుని గనెను. ఆ పుత్రునికి బదిసంవత్సరముల ప్రాయము వచ్చినప్పుడు, రాజుగారేదో రోగముచేత మృతినొందెను. అప్పుడు రాజ్యపాలనమంతయు దుర్గావతిమీద బడినందున నామె తన కుమారుని సింహాసనాధీశు జేసి, యతనిపేరిట తానేరాజ్యము జేయజొచ్చెను. ఆమె తన పెనిమిటివలెగాక, మిగుల