పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ దుర్గావతి

గీ. చిదుకుల గదల్చుటను నగ్ని చెలగి మండు;
   చెడుగు చేయుటచే బాము పడగద్రిప్పు
   మఱియు క్షోభంబువలననే మానవుడును
   దనదు మహిమంబు చూపును తధ్యముగను. - వీరేశలింగ కవి.

పదునారవ శతాబ్దమున బుందేల్‌ఖండు సంస్థానములో బ్రసిద్ధికెక్కిన రాజులలో బ్రథముడగు చందవేల్ రాజునకు రూపగుణసంపన్నురాలగు ఒక కన్య గలిగెను. ఆమె పేరు దుర్గావతి. ఆమె రూపగుణముల కీర్తి దిగంతములనిండి, యనేక రాజపుత్రు లామె కొరకు చందేల్ రాజును ఆశ్రయించుచుండిరి. కాని, యా రాజపుత్రులు తన కూతునకు దగినవారు కారని యెంచి, చందేల్ రాజు వారికేదో యొక కారణముచెప్పి పంపుచుండెను. ఒకసారి గడామండలా సంస్థానాధిపతియగు గోండు రాజు దుర్గావతిని దన కిమ్మని యామె తండ్రిని వేడెను. ఈ గోండు రాజుయొక్క శౌర్య సాహసములను గురించి చారులచే వినినది గావున, దుర్గావతియు నాయన యందు బద్ధానురాగయై యుండెను. గోండులు జాతియందును, విద్యయందును, నాగరికత యందును రాజపుత్రులకంటె దక్కువవారు. గోండువారార్యులుగారు; అనార్యులు. కనుక నిట్టి నీచకులజునికి దమ శ్రేష్ఠవంశపు కన్యను ఇచ్చుటకు చందేల్ రాజునకు నిష్టము లేక పోయెను. కాని, అప్పుడు గోండురాజు మిక్కిలి బలవంతుడుగా