పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గలిగెను. ఈమె సింహాసనారూడకాగానే సంస్థానమునందంతటను గొప్ప యానందఘోషమునకు బ్రారంభమాయెను. రాజ్యమునందనేకోత్సవములు జరిగెను.

ఈమె రాజ్యకార్య ధురంధరత్వమును సవిస్తరముగా వర్ణింపబూనిన నొక గొప్ప స్వతంత్రగ్రంథమగును. కనుక నటులచేయక యీమె విషయమై యొక గ్రంథకారుడు సంక్షేపముగా వ్రాసియున్న సంగతినే యిచ్చట భాషాంతరీకరించి వ్రాసెద. "శికందరుబేగమునకు రాజ్యాధికారము సంప్రాప్తమైనందువలన, ఆమె బుద్ధిప్రకాశము ప్రసరించుట కత్యంతవిశాలమైన యవకాశము దొరకెను. ఆమెకర్తృత్వసామర్థ్యములనుగురించి లోకులకు గల నమ్మకము నిజమని యామె కార్యముల వలన స్థిరపరచెను. రాజ్యమునకుగల ఋణమంతయు నామె యారు సంవత్సరములలో దీర్చివేసెను. గ్రామములు, తహశ్శీళ్లు వగైరాలు మక్తాకిచ్చెడి పూర్వపురీతి దీసివేసి, సొంతముగా గ్రామాధిపతుల వద్దనుండి తానే పన్నులు పుచ్చుకొనసాగెను. కొన్ని పదార్థముల గొందరు వ్యాపారులే అమ్మవలయునని గల నిర్బంధముల దీసి వేసి, ఆ పదార్థములందరు అమ్మవచ్చునని ఏర్పాటుచేసెను. ఇట్లు వ్యాపారవృద్ధికి దాను ముఖ్యకారణమాయెను. టంకశాలయొక్క బందోబస్తు సొంతముగా నామె చూచుకొనెను. సంరక్షకభటుల ననేకుల గ్రొత్తగా నేర్పరచి వారు దేశమునకు నష్టముచేయకుండ క్షేమమే చేయునటుల నేర్పాటు చేసెను. ఇట్లు రాజ్యములో ననేక సంస్కరణలాచరించెను. ఆమె ధైర్యముతో, సతతప్రయత్నముతో, బుద్ధికుశలతతో బ్రజల