పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నందువలన భార్యను దిన్నగా జూడకుండెను. సదా వ్యసనాసక్తుడై యున్నందువలన భార్యాభర్తల కనుకూలత లేక కలహములే జరుగుచుండెను. కాని శికందరుబేగము సద్గుణవతి గనుక, ఆ దాంపత్యకలహము చాలరోజులవరకు జరిగినదికాదు. పెనిమిటికి వీలయినంతవరకు బుద్ధిచెప్పి చూచి లాభములేదని తెలిసికొని, కలహము లాపుటకొరకై తల్లి వద్దకు వెళ్ళియుండుచు వచ్చెను. జహంగీరుఖాన్ దుర్మార్గుడై, యత్యంత వ్యసనాసక్తుడై నందువలన దొమ్మిది సంవత్సరములే రాజ్యముచేసి 1847 వ సంవత్సరమున మృతుడయ్యెను. ఇతనికి దస్తగీరను దాసీపుత్రుడొకడుండెను. జహంగీరు మృతుడయినప్పుడీ దాసీపుత్రునకు రాజ్య మియ్యవలసినదని మృత్యుపత్రమునందు వ్రాసెను. కాని ఈమృత్యుపత్రము నెవరును ఒప్పుకొనిన వారు కారు. శికందరుబేగమునకు శహజహానను స్వల్పవయస్కురాలగు కూతురొకతె యుండెను. ఈమె రాజ్యమున కధికారిణి గనుక, నీమె పెద్దదియగువరకు నీమె పేరిట శికందరుబేగముగారు రాజ్యపరిపాలనము చేయవలయునని ఇంగ్లీషువారు నిర్ణయించిరి.

శికందరుబేగము మొదలే బుద్థికుశలత గలదని విఖ్యాతి జెందియుండెను. అందులో నింత గొప్పరాజ్యమునకు స్వామినియైనందువలన నామెకు బుద్థివికాసముజూపుటకు మరింత యవకాశము గలిగెను. వర్షోదయమువలన చాతకములకును, క్షీర పానమువలన హంసపక్షులకును, చంద్రోదయమువలన చకోరములకును, అత్యంతానందము గలిగినటుల, శికందరుబేగము రాజ్యాధికారమును వహింపగానే ప్రజల కమిత ప్రమోదము